Krishna Board Stall: అంపైరే అన్యాయానికి దిగితే..
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:35 AM
ఉమ్మడి జలాశయాల నుంచి తరలించే కృష్ణా జలాలపై కచ్చితమైన సమాచారం కోసం రెండో దశలో టెలిమెట్రీలు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి బ్రేక్ పడింది....
కృష్ణా జలాల నీటి లెక్కలు తేల్చే టెలిమెట్రీలకు కృష్ణాబోర్డు బ్రేక్
మాజీ చైర్మన్ అంగీకరించినా.. సభ్యుడి నిరాకరణ
ఏపీ అంగీకారం మళ్లీ కావాలంటూ మెలిక
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జలాశయాల నుంచి తరలించే కృష్ణా జలాలపై కచ్చితమైన సమాచారం కోసం రెండో దశలో టెలిమెట్రీలు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి బ్రేక్ పడింది. కృష్ణా యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) 9వ సమావేశంలో.. రెండో దశలో 9 చోట్ల టెలిమెట్రీలు పెట్టాలని తీర్మానం చేశారు. దీనికి రూ.7 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీనికి తెలంగాణ, ఏపీ సమానంగా నిధులు ఇవ్వాల్సి ఉంది. ఏపీ నిధుల విడుదలకు జాప్యం చేస్తుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోక్యం చేసుకొని.. ఏపీ వాటా నిధులు ఇవ్వకపోతే మొత్తం వ్యయాన్ని తామే భరిస్తామని ప్రకటించారు. ఈ మేరకు బోర్డుకు లేఖ రాశారు. దాంతో టెండర్లు పిలవడానికి కనీసం రూ.4.15 కోట్లు కావాలని బోర్డు సమాచారం ఇవ్వగా.. ఆ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మే నెలలోనే టెండర్ డాక్యుమెంట్ కూడా సిద్ధమైంది. అయితే, టెండర్ పిలిచే క్రమంలో.. బోర్డు సభ్యుడిగా నియమితులైన కమల్ కుమార్ జంగిడ్ ఈ ప్రక్రియను అడ్డుకున్నారు. టెలిమెట్రీలకు ఏపీ సమ్మతి తెలిపితేనే టెండర్ పిలవాలని మెలిక పెట్టారు. ఈ మేరకు ఏపీకి లేఖ రాశారు. వాస్తవానికి 2018 అక్టోబరు 9న జరిగిన బోర్డు 9వ సమావేశంలోనే తెలంగాణతోపాటు ఏపీ కూడా టెలిమెట్రీలకు సమ్మతి తెలిపింది. ఇప్పుడు మళ్లీ ఏపీ సమ్మతి కావాలంటూ బోర్డు సభ్యుడు మెలిక పెట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. కృష్ణాబోర్డు చైర్మన్‌గా పని చేసిన, ప్రస్తుతం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌గా ఉన్న అతుల్ జైన్ కూడా టెలిమెట్రీలు పెట్టడానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చైర్మన్ ఆదేశించినా, స్వయంగా బోర్డు తీర్మానం చేసినా.. బోర్డు సభ్యుడు ప్రతిబంధకాలు సృష్టించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లెక్కలు లేకుంటే ఎలా?
ఏ రాష్ట్రం ఏ మేరకు నీటిని తరలిస్తుందో లెక్కలు తీసే బాధ్యత కృష్ణాబోర్డుదే. బచావత్ ట్రైబ్యునల్ కృష్ణా జలాలను గంపగుత్తగా ఉమ్మడి ఏపీకి కేటాయించింది. నిర్దిష్టంగా కేటాయింపులు కూడా లేవు. ప్రాజెక్టుల వారీగా, రాష్ట్రాల వారీగా కేటాయింపులు లేకపోవడంతో ఆ నీటిని ఎక్కడికైనా తరలించుకొని వినియోగించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీపై విచారణ జరుగుతున్నందున.. నీటి కేటాయింపులు చేసే దాకా నీటి లెక్కలు తీయాల్సి ఉంది. దీని కోసం రెండు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిగా ఉండాల్సిన బోర్డు, టెలిమెట్రీలు పెట్టాల్సిన బాధ్యత నుంచి పక్కకు జరిగి.. అడ్డుకునే స్థాయికి దిగజారటం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణాలో 50:50 శాతం నిష్పత్తితో నీటిని పంచాలని తెలంగాణ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. నీటి పంపకాలపై రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు.