Earth Sciences University: కళాశాల నుంచి విశ్వవిద్యాలయంగా
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:28 AM
కప్పుడు మైనింగ్ కాలేజీగా ప్రారంభమైన ఆ విద్యా సంస్థ కేవలం సింగరేణికి సంబంధించిన కోర్సులను మాత్రమే బోధించింది. ఆ తర్వాత కాకతీయ వర్సిటీకి అనుబంధంగాఇంజనీరింగ్ కళాశాలగా రూపాంతరం చెందింది....
దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందిన కొత్తగూడెం మైనింగ్ కాలేజీ
రూ.వెయ్యి కోట్లతో సదుపాయాలకు ప్రణాళికలు
నేడు రేవంత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
కొత్తగూడెం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు మైనింగ్ కాలేజీగా ప్రారంభమైన ఆ విద్యా సంస్థ కేవలం సింగరేణికి సంబంధించిన కోర్సులను మాత్రమే బోధించింది. ఆ తర్వాత కాకతీయ వర్సిటీకి అనుబంధంగాఇంజనీరింగ్ కళాశాలగా రూపాంతరం చెందింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో.. నేడు దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అవతరించబోతోంది. అరుదైన ఖనిజాలకు నెలవైన కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
1976 నుంచి ప్రస్థానం..
తొలినాళ్లలో 1976లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ పేరుతో కేవలం మైనింగ్ ఇంజనీరింగ్‌తో ఈ విద్యా సంస్థ ప్రారంభమైంది. అదే ఏడాది ఆరు సూత్రాల పథకం నిబంధనల ప్రకారం ఓయూ సొంత నిధులతో స్వతంత్ర యూనిట్‌గా ఎంఎస్సీ జియాలజీ కోర్సును అందించింది. అప్పటి నుంచి కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌లో బీఈ మైనింగ్ ఇంజనీరింగ్, ఎంఎస్సీ జియాలజీ సబ్జెక్టులు కొనసాగాయి. 1993లో ఆ కళాశాలను కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చిన అనంతరం 1994లో సీఎస్సీ, ఈఈఈ గ్రూపులను ప్రవేశపెట్టారు. 2011లో ఈసీఈ, ఐటీ గ్రూపులను చేర్చారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్న ఈ విద్యా సంస్థను పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా మార్చారు. సుమారు 300 ఎకరాల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. విశ్వ విద్యాలయ నిర్మాణానికి సుమారు రూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. అందులో తరగతి గదులు, హాస్టల్ భవనాలు, గ్రంథాలయం, సమావేశ మందిరం ఆట స్థలాలు, రీసెర్చ్ సెంటర్ లాంటి నిర్మాణాలకు రూ.500కోట్లు వరకు ఉండగా.. మరో రూ.500 కోట్లతో ప్రింటింగ్ మెషీన్లు, ఇంటర్‌నెట్, కంప్యూటర్లు, ఏసీలు, విద్యార్థుల ప్రయోగాలకు సంబంధించిన ల్యాబ్‌లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
అన్ని కోర్సులు ఉండేలా..
దేశంలోని పేరొందిన యూనివర్సిటీల్లో భూగోళ శాస్త్రానికి సంబంధించి ఒకటి రెండు కోర్సులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ముంబై, ఉస్మానియా యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాగా ఆయా కోర్సులు చదివిన వారికి దేశ విదేశాల్లో డిమాండ్‌తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో సాధారణ కోర్సులకు భిన్నంగా ఎర్త్ సైన్స్ వర్సిటీ ఆలోచన పుట్టింది. ఈ వర్సిటీలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సులతోపాటు, బీఎస్సీ, ఎంఎస్సీ జియాలజీ కోర్సులను ప్రారంభించారు. వాటికి సంబంధించి దోస్త్ ద్వారా అడ్మిషన్లు జరిగాయి.
అరుదైన ఖనిజాల నేల..
కొత్తగూడెం జిల్లా అరుదైన ఖనిజాలకు కేంద్రంగా ఉంది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలున్నాయి. రామవరం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం మండలాల్లో రత్నాల రాళ్లను మెరుగుపరిచేందుకు ఉపయోగించే గార్నెట్ దొరుకుతోంది. ఇల్లెందు మండలంలోని జాస్తుపల్లిలో ప్రొటెరోజోయిక్ అవక్షేపాలతో ఉన్న మార్బుల్.. భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో గ్లాస్ ఫౌండ్రీ, ఇనుము, ఉక్కు, సిరామిక్, ఎలక్ట్రికల్ అబ్రాసివ్ పెయింట్స్, ఎలకా్ట్రనిక్స్‌లో ఉపయోగించే క్వార్ట్జ్ లభిస్తోంది. అగ్నిపర్వత శిలల్లో కనిపించే ఫెల్డ్‌స్పార్.. అశ్వారావుపేటలో ఉంది.
నేడు ప్రారంభోత్సవం..
ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఈ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొత్తగూడెం రానున్న ఆయన.. కళాశాలలోని శిలాఫలకాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో రూపొందించిన యూనివర్సిటీ నిర్మాణ నమూనాను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షించారు. కలెక్టర్ జితేష్ విపాటిల్, ఇతర అధికారులతో చర్చించి, లోటుపాట్లు లేకుండా చూడాలని సూచనలు చేశారు.