Minister Damodar: సౌరవిద్యుత్‌లో కొండారెడ్డిపల్లి ఫస్ట్
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:57 AM
సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి దక్షిణ భారత దేశంలో మొదటి, దేశంలో రెండో గ్రామమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్....
కల్వకుర్తి/వంగూరు సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి దక్షిణ భారత దేశంలో మొదటి, దేశంలో రెండో గ్రామమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆదివారం రూ.134 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో 8 మెడికల్ కళాశాలలు, 74 ట్రామా కేర్ సెంటర్లు, 102 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు ఎంతో అవసరమని చెప్పారు. విద్యార్థులకు జీవనోపాధి కల్పించేందుకు, నైపుణ్యం పెంచడానికి రాష్ట్రంలో 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ప్రారంభించినట్లు రాజనర్సింహ తెలిపారు.