Konda Surekha Expresses Regret: నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలకు కొండా సురేఖ పశ్చాత్తాపం
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:35 AM
సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మంత్రి కొండా సురేఖ...
మంగళవారం అర్ధరాత్రి ట్వీట్
వరంగల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మంత్రి కొండా సురేఖ మంగళవారం అర్ధరాత్రి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నాగార్జున కుటుంబాన్ని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఎక్కడా లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలకు వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నట్లుగా తెలిపారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా, ఇప్పటికే కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా వేశారు. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ సమయంలో అకస్మాత్తుగా.. అర్ధరాత్రి దాటిన తరువాత సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయటంపై పలు రకాల చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సూచనలతోనే ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారనితెలుస్తోంది. అలాగే మంత్రి పొంగులేటితో ఉన్న విభేదాలను కూడా పరిష్కరించుకుని బుధవారం మేడారం జాతరలో జరిగిన అభివృద్ధి పనుల పరిశీలన, అధికారుల సమీక్ష సమావేశంలో సురేఖ పాల్గొన్నారనే చర్చ నడుస్తోంది.