Share News

Minister Konda Surekha: మీనాక్షి కోర్టులోకి కొండా వివాదం!

ABN , Publish Date - Oct 17 , 2025 | 02:51 AM

కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్‌ను అరెస్టు చేసేందుకు బుధవవారం రాత్రి ఆమె ఇంటికి మఫ్టీలో పోలీసులు వెళ్లడంతో మొదలైన హైడ్రామా..

Minister Konda Surekha: మీనాక్షి కోర్టులోకి కొండా వివాదం!

  • కూతురు సుస్మితతో కలిసి ఆమెతో కొండా సురేఖ సుదీర్ఘ భేటీ

  • వివాదంపై వివరణ.. పరిష్కరిస్తామన్న మీనాక్షి, మహేశ్‌ గౌడ్‌

  • తొలుత.. భట్టితో సురేఖ సమావేశం

  • క్యాబినెట్‌ భేటీకి గైర్హాజరు.. ప్రస్తుతానికి సద్దుమణిగిన వివాదం

  • ఎవరితోనూ విభేదాలు లేవు: మురళి

హైదరాబాద్‌, వరంగల్‌, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్‌ను అరెస్టు చేసేందుకు బుధవవారం రాత్రి ఆమె ఇంటికి మఫ్టీలో పోలీసులు వెళ్లడంతో మొదలైన హైడ్రామా.. గురువారం రాత్రి వరకూ కొనసాగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ల జోక్యంతో ప్రస్తుతానికి సద్దుమణిగింది. వారిద్దరితో గురువారం ఇక్కడ ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సుదీర్ఘంగా భేటీ అయిన మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత.. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరణ ఇచ్చారు. అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. మీనాక్షి, మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు తన ఆలోచనలు, ఇబ్బందులను వివరించానన్నారు. అందరం కూర్చుని మాట్లాడి దీన్ని పరిష్కరిస్తామని, సమన్వయం చేస్తామని వారు చెప్పినట్లు వెల్లడించారు. వారు తీసుకునే నిర్ణయం, ఇచ్చే ఆదేశాల మేరకు ముందుకు పోతానని సురేఖ స్పష్టం చేశారు. కాగా.. ఈ హైడ్రామా సందర్భంగా.. రెడ్లంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారంటూ కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం తమ అనుచరులకు పంపిన వీడియో సందేశంలోనూ అవే ఆరోపణలు కొనసాగించారు. పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితర రెడ్డి వర్గమంతా కలిసి కుట్రలు చేస్తున్నారని, ఇందులో కడియం శ్రీహరి, గుండు సుధారాణి, బస్వరాజు సారయ్య వంటి వారూ భాగస్వాములయ్యారని ఆరోపించారు. బీసీ నేతలపైన ఎందుకు ఇంత కక్ష కట్టారో తనకు తెలియదన్నారు. తాను చిన్నతనం నుంచీ ఫైటర్‌నని, ఎంత మంది పోలీసులు వచ్చినా తనను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఆమె వీడియో సందేశం వైరల్‌ కావడంతో.. కొండా సురేఖపైన పార్టీ హైకమాండ్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది.


అయితే సురేఖకు మీనాక్షీ నటరాజన్‌ ఫోన్‌ చేసి ఎలాంటి ప్రకటనలూ చేయవద్దని సూచించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు తాను కలుస్తానని సురేఖ చెప్పడంతో ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని ఆమె సూచించారు. అక్కడికి వెళ్లేముందు.. ప్రజాభవన్‌కు వెళ్లిన కొండా సురేఖ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో భేటీ అయ్యారు. క్యాబినెట్‌ సమావేశంలో పాల్గొనకూడదని అప్పటికే నిర్ణయించుకోవడంతో.. ఒక వేళ క్యాబినెట్లో ఈ అంశం చర్చకు వస్తే.. తన వాదన ఏంటన్నది ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి మీనాక్షి వద్దకు వెళ్లిన కొండా సురేఖ.. దక్కన్‌ సిమెంట్స్‌ కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడటమే కాకుండా పర్యావరణ నిబంధనలూ ఉల్లంఘించిందని వివరించినట్లు సమాచారం. తన మాజీ ఓఎస్డీని అరెస్టు చేసేందుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు వ్యవహరించిన తీరునూ ఆమె తప్పు పట్టారని తెలిసింది. ఆమె వాదనలను సావధానంగా విన్న మీనాక్షి, మహేశ్‌గౌడ్‌.. ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. మంత్రి సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలకు, తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తెలిపారు. ఆమె ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టంచేశారు.

రేవంత్‌.. మరో వైఎస్సార్‌

తమకు ఎవరితోనూ విభేదాలు లేవని.. ఎవరైనా సృష్టిస్తే వాటితో తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు.. ‘‘రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం.. తెలంగాణకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తరువాత రేవంత్‌రెడ్డి మరో వైఎ్‌సఆర్‌’’ అని వ్యాఖ్యానించారు. గురువారం హనుమకొండలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంత్‌రెడ్డి హమీ ఇచ్చారని, తప్పకుండా సీఎం తనకు ఎమ్మెల్సీ ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. కొండా సురేఖ మాజీ ఓఎ్‌సడీ సుమంత్‌ వ్యవహారం గురించి తనకు ఏమీ తెలియదన్నారు. కాగా.. కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్‌ తూర్పు నియోజకవర్గం కాంగ్రె్‌సలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి నియామకం కోసం ఏఐసీసీ పరిశీలకుడు వరంగల్‌లోని నాయుడు హోటల్‌లో కొండా మురళి అధ్యక్షతన వరంగల్‌తూర్పు నియోజకవర్గం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి సురేఖ కూడా హజరుకావాల్సి ఉన్నప్పటికీ తాజా వివాదం నేపథ్యంలో సమావేశానికి హాజరుకాలేదు. అయితే నగరంలోని డివిజన్‌ కమిటీ అధ్యక్షులు, కార్పొరేటర్ల నుంచి పరిశీలకులు వ్యక్తిగతంగా పిలుచుకుని అధ్యక్ష పదవికి ఎవరు అర్హులనే విషయంపై అభిప్రాయాలు సేకరించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హనుమకొండలో తన అనుచరులతో మరో సమావేశాన్ని నిర్వహించారు. ఒకే నియోజవర్గానికి చెందిన కార్యకర్తలతో ఇరువర్గాలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. మంత్రి సురేఖ మాజీ ఓఎ్‌సడీ సుమంత్‌ వ్యవహారంలో జరిగిన పరిణామాలపై అధిష్ఠానం ఆరా తీసింది. మీడియా ముందుకు రావొద్దని చెప్పినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్‌లో సురేఖ తన ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకున్నారని తెలిసింది. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులకు స్వేచ్ఛనిచ్చారని.. అలాగని బహిరంగంగా మాట్లాడ్డం సరికాదని కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవి అన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 02:51 AM