Share News

CM Revanth Reddy: ఏ సమస్య ఉన్నా నేరుగా నాకే చెప్పాలి

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:12 AM

కాంగ్రెస్‌ పార్టీలో దీపావళికి ముందు చిటపటలాడిన మంత్రి కొండా సురేఖ వివాదం.. దీపావళి రోజున చల్లారింది. సీఎం రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల భేటీతో....

CM Revanth Reddy: ఏ సమస్య ఉన్నా నేరుగా నాకే చెప్పాలి

  • కొండా దంపతులకు సీఎం రేవంత్‌ సూచన

  • దీపావళి రోజున ముఖ్యమంత్రితో వారి భేటీ

  • సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

  • తమ కూతురు సుస్మిత వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన కొండా దంపతులు

  • సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడుసంయమనం పాటించాలి: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌/వరంగల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీలో దీపావళికి ముందు చిటపటలాడిన మంత్రి కొండా సురేఖ వివాదం.. దీపావళి రోజున చల్లారింది. సీఎం రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల భేటీతో ఈ వివాదం సమసిపోయింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్టు చేసేందుకు ఆమె నివాసానికి పోలీసులు వెళ్లడం, ఆ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డిలపై సురేఖ కుమార్తె సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. చివరికి ఆ పంచాయితీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ కోర్టుకు చేరుకోవడం తెలిసిందే. మీనాక్షీ నటరాజన్‌తో భేటీ అనంతరం.. పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కొండా సురేఖ ప్రకటించారు కూడా. మీనాక్షీ, మహేశ్‌గౌడ్‌లతో భేటీకి ముందు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతోనూ సురేఖ భేటీ అయ్యారు. అయితే ఈ అంశంపైన సీఎం రేవంత్‌రెడ్డితో మీనాక్షీ, మహేశ్‌గౌడ్‌ల చర్చల అనంతరం సమస్య కొలిక్కి వచ్చింది. దీపావళి(సోమవారం) రోజున సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లిన కొండా సురేఖ, కొండా మురళి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భట్టివిక్రమార్క, మహేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు. తమను కావాలని కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి మీతో కలిసి నడిచామని కొండా దంపతులు సీఎం రేవంత్‌ రెడ్డితో చెప్పినట్లు తెలిసింది. మిమ్మిల్ని నమ్ముకుని ఉన్నా తమపై కొందరు ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు కుట్ర చేస్తున్నారని విరించినట్లు సమాచారం. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సురేఖక్క తనకు తోబుట్టువు లాంటిదని, ఏ ఇబ్బంది ఉన్నా.. సమస్య ఉన్నా నేరుగా తనతోనే చెప్పుకోవాలని సూచించినట్లుగా తెలిసింది. ఈ భేటీపై మహేశ్‌గౌడ్‌ స్పందిస్తూ.. కొండా సురేఖ వివాదం ముగిసిపోయిందని చెప్పారు. సురేఖ తన ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారని, తమ కూతురు సుస్మిత పొరపాటున మాట్లాడిందంటూ కొండా దంపతులు వివరణ ఇవ్వడంతో పాటు.. వాళ్లు కూడా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ఇక మీదట ఏ సమస్య ఉన్నా తనకే నేరుగా చెప్పాలని సురేఖకు సీఎం చెప్పారని వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మహేశ్‌గౌడ్‌ స్పష్టం చేశారు. సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు సంయమనం పాటించాలని, సీఎం రేవంత్‌కు మంత్రులందరూ సమానమేనని చెప్పారు. కాంగ్రె్‌సలో సమస్యలను పెద్ద మనసుతో పరిష్కారం చేసుకుంటామన్నారు. కాగా.. కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన తమ పార్టీ సీనియర్‌ నేత అని, ఆయన చేస్తున్న ఆరోపణలను పరిశీలిస్తామన్నారు. ఆయనకు ఏమైనా సమస్యలుంటే స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ పరిష్కరిస్తారని మహేశ్‌గౌడ్‌ చెప్పారు.

Updated Date - Oct 22 , 2025 | 05:12 AM