Komatireddy Counters Harish Rao: మిస్టర్ హరీశ్‌రావు.. మాది చేతల ప్రభుత్వం
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:31 AM
మిస్టర్ హరీశ్‌రావు.. మాది చేతల ప్రభుత్వం.. మీలా మాటల సర్కారు కాదు. మా ప్రభుత్వంలో విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం.....
31న సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘మిస్టర్ హరీశ్‌రావు.. మాది చేతల ప్రభుత్వం.. మీలా మాటల సర్కారు కాదు. మా ప్రభుత్వంలో విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. మీ హయాంలో శంకుస్థాపన స్థాయిలో విడిచిపెట్టిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ (టిమ్స్) ఆస్పత్రులను వేగంగా నిర్మిస్తున్నాం’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టిమ్స్ ఆస్పత్రులపై ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ ఇటీవల హరీశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బదులిచ్చారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని, తామే వాటిని చెల్లిస్తున్నామన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌ను ఈనెల 31న ప్రారంభిస్తామని, అల్వాల్‌లోని టిమ్స్‌ను వచ్చే ఏడాది మార్చిలో, ఎల్బీనగర్ టిమ్స్‌ను అదే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే నిమ్స్ విస్తరణ పనులను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు.