Kokapet Land Prices: కోట్ల పేట!
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:37 AM
కోకాపేటలో భూముల ధరలు సరి కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల వారే గాకుండా....
కోకాపేటలో భూముల ధరకు రెక్కలు
3న మరో 2 ప్లాట్లకు హెచ్‌ఎండీఏ వేలం
రూ.1200కోట్లకు పైగా వస్తుందని అంచనా
ఇప్పటికే 4 ప్లాట్లతో 2,708కోట్ల ఆదాయం
గతంలో 45ఎకరాలకు 3,319కోట్లు వస్తే..
తాజాగా 27ఎకరాలకే 3900 కోట్లు
హైదరాబాద్ సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కోకాపేటలో భూముల ధరలు సరి కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల వారే గాకుండా.. కర్ణాటక, తమిళనాడు దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది. గత వారం రెండు దఫాలుగా నాలుగు ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం వేయగా.. ఐదు ఎకరాల స్థలాన్ని ఎకరాకు రూ.151కోట్ల చొప్పున నలుగురు వ్యక్తులు దక్కించుకున్నారు. రెండు దఫాల్లో కలిపి మొత్తం నాలుగు ఓపెన్ ప్లాట్ల (దాదాపు 18ఎకరాల)ను విక్రయించగా.. హెచ్‌ఎండీఏకు రూ.2708 కోట్ల మేర ఆదాయం సమకూరింది. తాజాగా ఈ నెల 3వ తేదీన 4ఎకరాల విస్తీర్ణంలోని 19వ నంబర్ ప్లాటు, 4.04ఎకరాల విస్తీర్ణంలోని 20వ నంబర్ ప్లాటును వేలం వేసేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతుండగా.. ఈ సారి ఎంత ధర పలుకుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇటీవల 15వ నంబర్ ప్లాట్‌ను దక్కించుకోవడానికి పోటీపడిన సంస్థలే ఈ ప్లాట్లను కొనుగోలు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రెండు ప్లాట్ల విక్రయంతో దాదాపు రూ.1200కోట్లపైగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో..
కోకాపేటలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో పలు లేఅవుట్లను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది. 2022లో నియో పోలీసు, గోల్డెన్ మైల్ లేఅవుట్లలోని 49.94ఎకరాల విస్తీర్ణంలోని 8ప్లాట్లను విక్రయించగా.. సగటున ఎకరా రూ.40కోట్ల మేర పలికింది. అత్యధికంగా ఎకరాకు రూ.60కోట్లు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత 2023 ఆగస్టులో 45.33ఎకరాలు అమ్మకానికి పెట్టి ఎకరాకు అప్‌సెట్ ధరను రూ.35కోట్లు నిర్ణయించగా.. అత్యధికంగా రూ.100కోట్లు పలికి రికార్డు సృష్టించింది. సగటున ఎకరం ధర రూ.73.23కోట్లు పలికింది. 45ఎకరాల విక్రయం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.3319కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం కోకాపేటలో ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధరను హెచ్‌ఎండీఏ నిర్ణయిస్తే.. సగటున రూ.142.83కోట్ల దాకా పలికింది. రెండేళ్ల క్రితం నాటి సగటు ధరతో పోలిస్తే 97శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం. ఈ సారి కేవలం 27ఎకరాలు అమ్మడం ద్వారానే రూ.3900కోట్లపైగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. కాగా, కొనుగోలు చేసిన స్థలాల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్న రియల్ ఎసేట్ సంస్థలు.. ఇవి పూర్తయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో తమకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని భావిస్తున్నాయి.