Kokapet Land: కోకాపేటలో మళ్లీ కోట్లు!
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:15 AM
కోకాపేటలో భూముల ధర మళ్లీ కోట్లు పలికింది. రెండేళ్ల క్రితం ఇక్కడి స్థలాలను హెచ్‌ఎండీఏ విక్రయించగా ఎకరం అత్యధికంగా...
ఈసారి రూ.137 కోట్లు పలికిన ఎకరం భూమి ధర
9.9 ఎకరాల వేలంతో హెచ్‌ఎండీఏకు రూ.1,356 కోట్లు
రెండేళ్ల క్రితం ఇక్కడే ఎకరానికి రూ.100.75 కోట్లు
నాటి సగటు ధర రూ.73 కోట్లు.. నేడు రూ.136.75 కోట్లు
హైదరాబాద్ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కోకాపేటలో భూముల ధర మళ్లీ కోట్లు పలికింది. రెండేళ్ల క్రితం ఇక్కడి స్థలాలను హెచ్‌ఎండీఏ విక్రయించగా ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లు పలికి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇటీవల రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో టీజీఐఐసీ భూములను వేలం వేస్తే ఎకరం ఏకంగా రూ.177 కోట్లు పలికింది. తాజాగా కోకాపేటలోనే మరోసారి రూ.100 కోట్ల మార్కు దాటింది. అక్కడి నియోపోలీస్ లేఅవుట్‌లోని 17, 18వ నంబర్ ప్లాట్లను హెచ్‌ఎండీఏ సోమవారం ఆన్‌లైన్‌లో (ఈ-వేలం) వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎ్‌సటీసీ ఈ కామర్స్ నిర్వహించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగిన వేలంలో పదికి పైగా ప్రముఖ జాతీయ, స్థానిక డెవలపర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో మొదటగా 5.31 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 18వ నంబర్ ప్లాట్‌ను ఎకరం రూ.137.25 కోట్ల చొప్పున ఎంఎ్‌సఎన్ అర్బన వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ అనే సంస్థ సొంతం చేసుకుంది. 4.59 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న17వ నంబర్ ప్లాట్‌ను ఎకరం రూ.136.50 కోట్ల చొప్పున వజ్ర హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పీ అనే సంస్థ దక్కించుకుంది. మొత్తం 9.90 ఎకరాల విస్తీర్ణంలోని ఈ రెండు ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.1,356 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 28న నియోపోలీస్ లేఅవుట్‌లోని 15, 16 నంబర్ ప్లాట్లను, డిసెంబర్ 3న 19, 20 నంబర్ ప్లాట్లను వేలం వేయనున్నారు.
సగటు ధరలో 87 శాతం వృద్ధి
రెండేళ్ల క్రితం కోకాపేటలో ఎకరానికి పలికిన సగటు ధరతో పోల్చితే ప్రస్తుతం 87 శాతం ఽపెరుగుదల నమోదుకావటం గమనార్హం. నాడు నియోపోలీస్ లేఅవుట్‌లోనే అత్యధికంగా ఎకరం రూ.100.75 కోట్లు, అత్యల్పంగా రూ.67.25 కోట్లు పలికింది. ఎకరానికి రూ.35 కోట్లు కనీస ధరను హెచ్‌ఎండీఏ నిర్ణయిస్తే.. సగటున రూ.73.23 కోట్లు ఖరారైంది. తాజాగా ఎకరం సగటు ధర రూ.136.75 కోట్లు పలకటంతో 87 శాతం వృద్ధి నమోదైనట్లు అయ్యింది. భూములకు భారీ ధర పలకటంపై రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు, నిర్మాణ సంస్థల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒడిదుడుకులు లేకుండా దేశంలో అత్యంత చురుకుగా పురోగమిస్తున్న మార్కెట్‌లో ఒకటిగా హైదరాబాద్ నిలుస్తోందని చెబుతున్నారు. 18వ ప్లాట్‌ను కొనుగోలు చేసిన ఎంఎ్‌సఎన్ సంస్థ గతంలో ఇదే లేఅవుట్‌లో ఎకరం రూ.73 కోట్ల చొప్పున ఏడు ఎకరాలను రూ.511 కోట్లకు కొనుగోలు చేసింది. అందులో ఆ సంస్థ కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక వేస్తోంది. తాజాగా 5.31 ఎకరాలను రూ.728 కోట్లకు కొనుగోలు చేసింది. ప్లాట్లను కొనుగోలు చేసిన సంస్థలు డిపాజిట్ సొమ్ము రూ.5 కోట్లు మినహాయించి స్థలం ఖరీదులో కనీసం 25 శాతం మొదటి విడతగా ఏడు రోజుల్లో చెల్లించాలి. చివరి విడతగా మిగతా 75 శాతాన్ని డిపాజిట్ సొమ్మును కలుపుకొని చెల్లించాలి. వారం రోజుల్లో మొదటి విడత చెల్లించలేకపోతే సదరు సంస్థకు నోటీసులిచ్చి వేలాన్ని రద్దు చేస్తారు. డిపాజిట్ సొమ్ము తిరిగిచ్చేది ఉండదు.