Kodandaram Urges: ఉద్యమకారులకిచ్చిన హామీలను నెరవేర్చాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:09 AM
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు.
అందుకోసం ప్రభుత్వంతో అన్ని స్థాయుల్లో చర్చిస్తా
ఆ ప్రక్రియను నేటి నుంచే మొదలుపెడతా : కోదండరాం
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతో అన్ని స్థాయు ల్లో చర్చిస్తానని, ఈ ప్రయత్నాన్ని మంగళవారం నుంచే మొదలు పెడతానని చెప్పారు. టీజేఎస్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ సమావేశం జరిగింది. ఇందులో విశ్రాంత జడ్జి చంద్రకుమార్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవర్ధన్, వివిధ ఉద్యమ సంఘాల జేఏసీలు, ఉద్యమకారుల సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, ఉద్యమకారుల సంక్షేమం కోసం కోదండరాం నాయకత్వంలో కలిసి పనిచేయడం సహా మూడు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారుల సంక్షేమం కోసం అందరం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నాడు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారు నేడు కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. హామీల అమలు సాధ్యం కాకుంటే మరోసారి సమావేశమై కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాస్వామిక పాలన కొనసాగించి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పారు.