Minister Tummala: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం..
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:56 AM
పత్తి కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు...
పత్తి కొనుగోళ్లపై చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం: తుమ్మల
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీలో కిషన్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. పత్తి కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపిందని తుమ్మల గుర్తు చేశారు. దాంతోనే జిన్నింగ్ మిల్లర్లు టెండర్లలో పాల్గొనటానికి ముందుకు వచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకుంటే ఇలాంటి ప్రతిష్టంభన ఉండేది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి కనీస మద్దతు ధర రైతుల సాగు వ్యయాలకు తగినట్లుగా లేదని, 2021, 2022 సంవత్సరాల్లో రైతులు ప్రైవేటుగా అమ్ముకునే ధర కంటే తక్కువ ధరే ఉందని ఆక్షేపించారు. దీనిపై గత నెలలో సీఏసీపీ చైర్మన్‌కు లేఖ కూడా రాసినట్లు తుమ్మల తెలిపారు. కనీస మద్దతు ధర ప్రకటించిన పంటల్లో కేంద్రం ఎన్ని రకాల పంటలు కొంటోందని.. కొన్ని పంటలపై 25శాతం సీలింగ్ ఎందుకు విధిస్తున్నారని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు.