Union Minister Kishan Reddy: లీకులు ఇచ్చినోళ్లు మెంటల్‌గాళ్లు
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:34 AM
ప్రధాని మోదీతో తెలంగాణ ఎంపీల భేటీకి సంబంధించిన వివరాలు బయటకు పొక్కడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్ అయ్యారు.....
సమావేశ వివరాలను బయటపెట్టొద్దని
ప్రధాని మోదీ చెప్పినా పట్టించుకోలేదు
ఆ ఎంపీలెవరో చెప్తే చర్యలు తీసుకుంటాం
మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్‌రెడ్డి
2036 ఒలింపిక్స్ అవకాశం భారత్‌కు దక్కేలా ప్రయత్నిస్తున్నామన్న కేంద్రమంత్రి
న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీతో తెలంగాణ ఎంపీల భేటీకి సంబంధించిన వివరాలు బయటకు పొక్కడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. భేటీ వివరాలను లీకు చేసినోళ్లు మెంటల్ గాళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ వివరాలను బయటకు చెప్పొద్దని స్వయంగా ప్రధాని మోదీ ఆదేశించినప్పటికీ.. పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో మంగళవారం కిషన్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. లీకులు ఇచ్చిన ఎంపీలెవరో మీడియా ప్రతినిధులు చెప్తే.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మోదీతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం గురించి చర్చించామని తెలిపారు. సాధారణంగా ఏ యాజమాన్యమైనా.. సంస్థ ప్రతినిధులతో సమావేశమైనప్పుడు అభివృద్ధి గురించి ఎంత సీరియ్‌సగా చర్చిస్తుందో.. తమ భేటీ సైతం అలాగే జరిగిందని ఒక మీడియా సంస్థ పని తీరును ఉదహరిస్తూ చెప్పారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని మోదీ సూచించినట్లు తెలిపారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితీన్ నబీన్ నియామకంపై స్పందిస్తూ.. సాధారణ కార్యకర్త నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుందన్నారు. కాగా, 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు 792 జిల్లాల్లో ఖేలో ఇండియా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అథ్లెట్ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి, ఎనిమిదేళ్ల పాటు శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో క్రీడాకారుడిపై ఏటా రూ.6.28 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్పోర్ట్స్ పరికరాలను తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు, వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఫిట్ ఇండియా మూమెంట్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 3,181 కోట్లతో 350 క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టామన్నారు.