Kishan Reddy Urges: ఫిరాయింపుల రూలింగ్‌పై..స్పీకర్ పునరాలోచించాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:28 AM
పార్టీ ఫిరాయింపుల అంశంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
పార్టీ మారినట్లు ఆ ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పారు
ఆధారాలు న్నా.. లేవని చెప్పడం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపుల అంశంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. స్పీకర్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని సూచించారు. ఫిరాయింపుల చట్టం ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీవీల ముందు, ప్రజల ముందు కొందరు ఎమ్మెల్యేలు పార్టీలు మారినట్లు స్పష్టం చేశారని, కాంగ్రె్‌సకు అనుకూలంగా ప్రచారం చేశారని.. ఇన్ని ఆధారాలున్నా.. వారు పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం విచారకరమని అన్నారు. గురువారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో నాడు బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు.. నిబంధనలను నీరుగార్చాయని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రాజ్యాంగాన్ని చేతపట్టుకొని తిరగడం కాదని.. తెలంగాణలో రాజ్యాంగాన్ని ఎలా అవమానిస్తున్నారోచూసి చర్యలు తీసుకోవాలని సూచించారు.
సింగరేణికి 47 వేల కోట్ల బకాయిలు..
తెలంగాణ విద్యుత్ రంగం అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతోందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకపోయాయని, రూ.వేల కోట్ల అప్పుల భారం మోయలేక ఆ సంస్థల నడ్డి విరుగుతోందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసిన శ్వేతపత్రంలో.. వివిధ విద్యుత్ విభాగాలు, డిస్కంలు చెల్లించాల్సిన అప్పు రూ.30 వేల కోట్లకు పైగా ఉందని చెప్పారని.. కానీ, విద్యుత్ సంస్థలు ఒక్క సింగరేణి సంస్థకే దాదాపు 47 వేల కోట్లు బాకీ పడ్డాయని కిషన్‌రెడ్డి తెలిపారు. 2035 నాటికి 40 వేల మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తామని క్లీన్ అండ్ గ్రీన్ పాలసీలో ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.