Share News

Kishan Reddy Slams Rahul Gandhi: పట్టుకు తిరగడం కాదు.. రాజ్యాంగాన్ని ఒకసారి చదవండి

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:55 AM

రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని తిరగడం కాదని, దానిని ఓసారి చదివితే అందులో ఏముందో తెలుస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంఽధీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హితవు పలికారు...

Kishan Reddy Slams Rahul Gandhi: పట్టుకు తిరగడం కాదు.. రాజ్యాంగాన్ని ఒకసారి చదవండి

  • ‘సర్‌’పై రాహుల్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని తిరగడం కాదని, దానిని ఓసారి చదివితే అందులో ఏముందో తెలుస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంఽధీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హితవు పలికారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై లోక్‌సభలో రాహుల్‌గాంధీ మాట్లాడిన మాటలు హాస్యాస్పదమన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ నాయకులకు ఎన్నికల వ్యవస్థపై కనీస అవగాహన లేదని రాహుల్‌గాంధీ మాటలతో మరోసారి నిరూపితమైందని విమర్శించారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సంస్కరించేందుకు ఎస్‌ఐఆర్‌ అవసరమనే విషయాన్ని రాహుల్‌గాంధీ తెలుసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా తప్పులతడకగా ఉందని ఒకపక్క ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు చేయడం, మరోపక్క ఆ తప్పులను సరిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన సవరణను విమర్శించడం రాహుల్‌గాంధీ రెండు నాలుకల ధోరణికి, వితండవాదానికి, అవగాహనారాహిత్యానికి అద్దం పడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు వారి అసమర్థతకు కారణాలను తెలుసుకోకుండా, ఎన్నికల కమిషన్‌ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై దుష్ప్రచారం మానుకోవాలన్నారు. లేకపోతే ప్రజలు మరింత తిరస్కరిస్తారని గుర్తుంచుకోవాలన్నారు

Updated Date - Dec 11 , 2025 | 04:55 AM