Union Minister G. Kishan Reddy: 6 గ్యారంటీలను గాలికొదిలేశారా?
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:23 AM
ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను గాలికొదిలేశారా? అంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రశ్నించారు....
విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంకేతం?
సోనియాగాంధీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను గాలికొదిలేశారా? అంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలను పక్కనబెట్టి, విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇవ్వడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మేరకు ఆదివారం సోనియాకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్ పేరిట రూపొందించిన పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వచ్చి స్వయంగా మీకు అందజేశారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన దూరదృష్టిని మీరు అభినందించారు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన మీరు.. అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించారు. అంతే కాకుండా స్వయంగా 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. మరి మేనిఫెస్టో అమలు గురించి కానీ, మీరు స్వయంగా ప్రకటించిన 6 గ్యారంటీల అమలు గురించి కానీ ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా? కనీసం సీఎం రేవంత్‌రెడ్డి మిమ్మల్ని కలిసినప్పుడైనా వాటి గురించి అడిగారా? రెండేళ్ల పాలన పట్ల సీఎం రేవంత్‌ను మీరు అభినందించారు. అంటే, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేశారా? లేదా? అనేది మీకు తెలిసినట్లు లేదు. కనీసం తెలుసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించినట్లు లేదు. హామీలను గాలికొదిలేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ కొత్త హామీలు ఇస్తూ మీకు మీరే ఒకరినొకరు అభినందనలు తెలుపుకుంటున్నారు’ అని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేలేశారా? లేక గాంధీభవన్‌లో పాతరేశారా? తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.