Share News

Union Minister Kishan Reddy urged: కాంగ్రెస్‌కు హిందువులు ఇజ్జత్‌ కాదా?

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:17 AM

జూబ్లీహిల్స్‌ భవిష్యత్తును నిర్దేశించే ఈ ఉప ఎన్నికలో ప్రజలు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు....

Union Minister Kishan Reddy urged: కాంగ్రెస్‌కు హిందువులు ఇజ్జత్‌ కాదా?

  • మజ్లి్‌సను రేవంత్‌ భుజాలమీద వేసుకుని తిరుగుతున్నారు: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ/ఎర్రగడ్డ, బోరబండ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ భవిష్యత్తును నిర్దేశించే ఈ ఉప ఎన్నికలో ప్రజలు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకూ జూబ్లీహిల్స్‌ నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచినా అభివృద్ధి చేయలేదని.. ఈసారి బిజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్‌లలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్‌ హయాంలో మజ్లిస్‌ ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసని.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఒక్కప్పటి మజ్లిస్‌ నాయకుడేనని, ఆయన గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారని, మజ్లిస్‌ నుంచి కాంగ్రెస్‌ అరువు తెచ్చుకుని టికెట్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ‘‘కాంగ్రెస్‌ పార్టీ ముస్లింల ఇజ్జత్‌’’ అనడమేమిటంటూ సీఎం రేవంత్‌పై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి హిందువులు ఇజ్జత్‌ కాదా?’’ అని కిషన్‌ రెడ్డి నిలదీశారు. మజ్లిస్‌ పార్టీని రేవంత్‌ రెడ్డి భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘‘మీకు మేయర్‌... మాకు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే’ అని మజ్లి్‌సతో కాంగ్రెస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.’’ అని ఆరోపించారు. దేశంపైన కొంచెం కూడా అభిమానం లేకుండా రేవంత్‌ రెడ్డి సైనికులను కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు పోయినట్లు... రేవంత్‌ రెడ్డి సైతం ఫాంహౌ్‌సకు వెళ్లాల్సిందేనని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటున్న మార్పు బీజేపీతోనే వస్తుందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలూ ఒక్కో ఓటుకు రూ.20-30 వేలు ఇస్తున్నాయని.. గెలిచిన తర్వాత ఆ డబ్బులను ప్రజల దగ్గరే వసూలు చేసుకుంటాయని, అలాంటి పార్టీలను గెలిపించవద్దని కిషన్‌ రెడ్డి సూచించారు. బుధవారం రాత్రి బీజేపీ కార్యకర్తలు బోరబండలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 02:17 AM