Share News

Union Minister Kishan Reddy: బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే.. వెళ్లి కాంగ్రెస్‌లో చేరుతారు

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:05 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే వెళ్లి కాంగ్రె్‌సలో చేరుతారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు....

Union Minister Kishan Reddy: బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే.. వెళ్లి కాంగ్రెస్‌లో చేరుతారు

  • ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. ఏ ముఖం పెట్టుకుని జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నారు?

  • హామీలు నెరవేర్చని కాంగ్రె్‌సకు ఓట్లడిగే హక్కు లేదు

  • జూబ్లీహిల్స్‌ కాంగ్రె్‌సకు.. మేయర్‌ పదవి ఎంఐఎంకు... ఇదీ ఆ పార్టీల ఒప్పందం

  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే

  • దానికి జూబ్లీహిల్స్‌ ఎన్నికతోనే నాంది

  • ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/ వెంగళరావునగర్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే వెళ్లి కాంగ్రె్‌సలో చేరుతారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెళ్లి కాంగ్రె్‌సలో చేరారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్‌ జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా మజ్లిస్‌ చెప్పినట్టే నడుచుకుంటాయని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, అందుకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక విజయంతోనే నాంది అని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం వెంగళరావునగర్‌ డివిజన్‌లో బైక్‌ ర్యాలీ, బోరబండలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌ మేయర్‌ పదవిని మజ్లి్‌సకు ఇవ్వాలని కాంగ్రె్‌సతో ఒప్పందం చేసుకుందని, అందుకే జూబ్లీహిల్స్‌లో కాంగ్రె్‌సకు మజ్లిస్‌ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే మజ్లిస్‌ ఆగడాలను అరికడతామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వందల కోట్లు కుమ్మరించి జుబ్లీహిల్స్‌లో గెలవాలనుకుంటున్నాయని ఆరోపించారు. హామీలు నేరవేర్చని కాంగ్రె్‌సకు జూబ్లీహిల్స్‌లో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రచారానికి వచ్చే ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కాగా, బోరబండ పోచమ్మ ఆలయంలో పూజలు చేసిన కిషన్‌రెడ్డి.. అనంతరం వినాయకరావు నగర్‌, బంజారానగర్‌, స్వరాజ్‌నగర్‌ బస్తీలలో ఇల్లిల్లూ తిరిగి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలన చూశారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.


ఉప ఎన్నిక ఫలితం రాజకీయంగా కీలకం

రాష్ట్రంలో కాంట్రాక్టులు, రాజకీయ బేరసారాలే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రాథమ్యాలుగా మారిపోయాయని బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకత్వం అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ ప్రలోభాలు, మాయమాటలతోనే నెట్టుకొస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం రాజకీయంగా కీలకంగా మారబోతోందన్నారు. కాగా, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే రాజీనామా చేస్తారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ సవాలు విసిరారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు.

7 నుంచి ‘వందేమాతరం’ మహోత్సవాలు

ఈ నెల 7 నుంచి 25 వరకు‘వందేమాతరం-150’ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీ కె.లక్ష్మణ్‌ తెలిపారు. 7న దేశవ్యాప్తంగా 150 ప్రముఖ స్థలాల్లో, 150 మంది గాయకుల ఆధ్వర్యంలో ‘వందేమాతరం’ గేయం ఆలపిస్తారని చెప్పారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, గోల్కొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కార్యక్రమం ఉంటుందన్నారు. మహోత్సవాల కోసం జార్ఖండ్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ కు తనను ఇన్‌చార్జిగా నియమించారని చెప్పారు.

Updated Date - Nov 05 , 2025 | 04:05 AM