Union Minister Kishan Reddy: మజ్లిస్ మెప్పు కోసం సీఎం పని చేస్తున్నారు
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:54 AM
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే సన్న బియ్యం ఆగిపోతాయని సీఎం రేవంత్ చెబుతున్నారు. బియ్యం పంపిణీ పథకంలో ప్రతి కిలోకు...
ఆయన వ్యాఖ్యలపై స్పందించడం సమయం వృథా
సన్నబియ్యం పంపిణీ ఎలా ఆపుతారో మేం చూస్తాం
కాళేశ్వరంపై విచారణకు రాహుల్‌గాంధీ నో చెప్పారు
అందుకే సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకొన్నారు
బీఆర్‌ఎ్‌సతో మాకు ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవు
‘మీట్ ది ప్రెస్’లో కిషన్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే సన్న బియ్యం ఆగిపోతాయని సీఎం రేవంత్ చెబుతున్నారు. బియ్యం పంపిణీ పథకంలో ప్రతి కిలోకు కేంద్రం రూ.42 రూపాయలు భరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.15 మాత్రమే. బియ్యం పంపిణీని ఎలా ఆపుతారో మేమూ చూస్తాం’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మజ్లిస్ పార్టీ మెప్పు కోసం సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. ‘‘రేవంత్.. పార్టీలన్నీ తిరిగి.. ఇప్పుడు కాంగ్రె్‌సలో ఉన్నారు. చేతకాని వాళ్లు అనేకం మాట్లాడుతారు. అలాంటి వాటికి సమాధానం చెప్పి సమయం వృథా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వ్యక్తిగత విమర్శలతో కూడిన రేవంత్ వ్యాఖ్యలను సీరియ్‌సగా తీసుకోబోం’’ అని వ్యాఖ్యానించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొని, పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు రాహుల్ గాంధీ నో చెప్పడం వల్లే సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకొన్నారని ధ్వజమెత్తారు. మిగతా అంశాలన్నీ పక్కనపెట్టి.. ఒక్క కాళేశ్వరం విచారణను మాత్రమే ఎందుకు అప్పగించారో సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య సత్సంబందాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు నెలకొందని, సర్వే ఫలితాలు నమ్మదగ్గట్టుగా లేవని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఇప్పటికే తమకు మద్దతు తెలపగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు తమతో కలిసి పని చేస్తున్నారని వెల్లడించారు. బీఆర్‌ఎ్‌సతో తమకు ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవని, భవిష్యత్తులోనూ ఆ పార్టీతో ఎలాంటి పొత్తూ ఉండదని స్పష్టం చేశారు.
తాను ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడానన్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని దుయ్యబట్టారు. వేల కోట్లు ఖర్చు చేశామని బీఆర్‌ఎస్ చెబుతున్నా.. ఒక గ్రామ, మండల స్థాయి అభివృద్ధి కూడా అక్కడ కనిపించడం లేదని ధ్వజమెత్తారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే దారిలో నడుస్తోందన్నారు. నాలుగు ప్రధాన రోడ్లు పెద్దగా ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు కాదని, బస్తీల్లో పరిస్థితి ఎలా ఉందనేదే ముఖ్యమని అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు రాక ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. 1366కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్, 436కోట్లతో తార్నాకలో నేషనల్ సైన్స్ సిటీ, న్యూ మింట్ మ్యూజియం, నేషనల్ ఎపిగ్రాఫిక్ మ్యూజియం, తెలంగాణ లిబరేషన్ వర్చువల్ మ్యూజియం పనులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి, రాష్ట్రంలో అనేక సంస్థల స్థాపనకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.1.20లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలను బీసీల్లో కలిపి.. రిజర్వేషన్లు కట్టబెడతామంటే ఎలా? అని ప్రశ్నించారు. సీసీఐ ఆధ్వర్యంలో మార్చి దాకా పత్తి కొంటామని, తేమ శాతం 12ు మించకుండా చూసుకోవాలని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.