Share News

KIMS Introduces Spine Robo: వెన్నెముక శస్త్రచికిత్సల్లో కొత్త శకం

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:06 AM

వెన్నెముక శస్త్రచికిత్సల్లో స్పైన్‌ రోబో పరికరాన్ని వినియోగించడం ద్వారా సరికొత్త శకానికి నాంది పలికామని కిమ్స్‌ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు అన్నారు.

KIMS Introduces Spine Robo: వెన్నెముక శస్త్రచికిత్సల్లో కొత్త శకం

  • కిమ్స్‌లో ‘స్పైన్‌ రోబో’ ఆవిష్కరణ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వెన్నెముక శస్త్రచికిత్సల్లో స్పైన్‌ రోబో పరికరాన్ని వినియోగించడం ద్వారా సరికొత్త శకానికి నాంది పలికామని కిమ్స్‌ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు అన్నారు. ఆదివారం హైటెక్‌ సిటీలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘స్పైన్‌ రోబో’ పరికరాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. భాస్కర్‌రావు మాట్లాడుతూ.. వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం అత్యంత కీలకమన్నారు. స్నైన్‌ రోబో ద్వారా అది సాధ్యమవుతుందన్నారు. సాధారణ శస్త్ర చికిత్సలతో పోలిస్తే రోబోటిక్‌ విధానంలో రిస్క్‌ శాతం తక్కువగా ఉంటుందని, వెన్నెముకలోని నరాలకు ఎటువంటి హాని చేయకుండా అనుకున్న చోటే శస్త్రచికిత్స చేయడానికి రోబోటిక్‌ టెక్నాలజీ తోడ్పడుతుందని న్యూరోసర్జరీ విభాగాధిపతి డా. మానస్‌ కుమార్‌ పాణిగ్రాహి అన్నారు. రక్తస్రావం తక్కువగా ఉండటంతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు తగ్గుతుందని చెప్పారు. గతంలో మోకాళ్ల మార్పిడి, ఇతర శస్త్రచికిత్సల్లో రోబోటిక్‌ విధానం అందుబాటులో ఉండేదని, ఇప్పుడు అదేస్థాయి నాణ్యత, భద్రతను వెన్నెముక శస్త్ర చికిత్సలకు అందుబాటులోకి తీసుకొచ్చామని కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రి ఎండీ, చీఫ్‌ జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ సర్జన్‌ డా. ఏవీ గురవారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో న్యూరోసర్జన్‌,డా. బీవీ సవిత్ర్‌ శాస్త్రి, చీఫ్‌ రోబోటిక్‌ జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ సర్జన్‌ డా. సాయిలక్ష్మణ్‌, కోల్‌కతాలోని కొఠారీ మెడికల్‌ సెంటర్‌ స్పైన్‌ సర్జరీ విభాగాధిపతి డా. సౌమ్యజిత్‌ బసు, రీజనల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డా. సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 05:06 AM