Share News

Kidney and Cancer Cases: బాబోయ్‌.. కిడ్నీ, క్యాన్సర్‌!

ABN , Publish Date - Oct 14 , 2025 | 03:24 AM

రాష్ట్రవ్యాప్తంగా కిడ్నీ, క్యాన్సర్‌ కేసుల తీవ్రత పెరుగుతోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో నమోదవుతున్న టాప్‌ 10 కేసుల్లో...

Kidney and Cancer Cases: బాబోయ్‌.. కిడ్నీ, క్యాన్సర్‌!

  • రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్న కేసులివే

  • ఆ తర్వాత ఎముకలు, గుండె సంబంధిత జబ్బులు

  • రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ అధ్యయనం

  • 2020-25లో ప్రైవేటు ఆస్పత్రుల్లో కేసుల విశ్లేషణ

  • ఎక్కువ కేసులున్న విభాగాల బలోపేతానికి చర్యలు!

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కిడ్నీ, క్యాన్సర్‌ కేసుల తీవ్రత పెరుగుతోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో నమోదవుతున్న టాప్‌ 10 కేసుల్లో ఇవి 1, 2 స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆరోగ్యశ్రీలో నమోదవుతున్న కేసుల ఆధారంగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 2020-25 మధ్య నమోదైన కేసుల సమాచారాన్ని వైద్య శాఖ విశ్లేషించింది. అందులో అత్యధికంగా నమోదయ్యే 10 కేసులను తీసుకోగా.. మొదటి స్థానంలో కిడ్నీ, రెండో స్థానంలో క్యాన్సర్‌ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత వరసగా ఆర్థోపెడిక్‌, కార్డియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఆప్తమాలజీ, న్యూరోసైన్స్‌, జనరల్‌ సర్జరీ, పిడియాట్రిక్స్‌, గైనకాలజీ, ఈఎన్‌టీ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో అత్యధికంగా అవసరమయ్యే సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు ఇవేనని వైద్యశాఖ గుర్తించింది. 2020-25 మధ్య కాలంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అత్యధికంగా 3,63,197 కిడ్నీ సంబంధిత కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఆంకాలజీ 3,06,702; ఆర్థోపెడిక్‌ 1,91,852; కార్డియాలజీ 1,45,814 కేసులు ఉన్నాయి. దీంతో ఈ నాలుగు విభాగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. కేసులు ఎక్కువగా నమోదయ్యే విభాగాలను గుర్తించి, వాటిని బలోపేతం చేయడం వల్ల రోగులపై ఆర్థిక భారం తగ్గుతుంది. వీటితో పాటు జనరల్‌ మెడిసిన్‌ (73,697), ఆప్తమాలజీ (57,639), న్యూరో (40,667), జనరల్‌ సర్జరీ (31,214), పిడియాట్రిక్‌(28,924), గైనకాలజీ(9,517) విభాగాల్లోనూ ఎక్కువగా కేసులు నమోదవుతున్నందున, వీటిని కూడా బలోపేతం చేయాలని వైద్య శాఖ భావిస్తోంది.


ప్రత్యేక కార్యాచరణ ఇలా..

నెఫ్రాలజీ: కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను పెంచనుంది. కిడ్నీ మార్పిడి సౌకర్యాలను జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఆంకాలజీ: గ్రామీణ స్థాయిలో క్యాన్సర్‌ నిర్ధారణ, చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. కీమో, రేడియో థెరపీ వంటి చికిత్సలను జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తేవడం ద్వారా రోగులు హైదరాబాద్‌కు వెళ్లే భారాన్ని తగ్గ్గించనున్నారు.

ఆర్థోపెడిక్‌: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఆత్మహత్యాయత్నం కేసులూ ఎక్కువ అవుతున్నాయి. అలాగే, ఎముకల వ్యాధుల బారిన పడేవారికి మెరుగైన చికిత్స అందించాల్సి వస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 74ట్రామాకేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

కార్డియాలజీ: గుండె జబ్బుల నిర్ధారణ, చికిత్స కోసం జిల్లా ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్స్‌ వంటి అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విభాగాల బలోపేతం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణాన్ని వినియోగించనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

సూపర్‌ స్పెషాలిటీ పీజీ సీట్ల పెంపు?

రాష్ట్రంలో ఎక్కువగా నమోదయ్యే కేసులేంటనేది తేలడంతో ఆ విభాగపు సూపర్‌ స్పెషాలిటీ సీట్ల సంఖ్యను పెంచాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 165 సూపర్‌ స్పెషాలిటీ సీట్లు ఉండగా, ప్రైవేటులో 38 మాత్రమే ఉన్నాయి. దీంతో సర్కారీ కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ సీట్ల పెంపు కోసం జాతీయ వైద్య కమిషన్‌కు లేఖ రాయాలని సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా జిల్లాల్లోని బోధనాస్పత్రుల్లో ఈ సీట్ల సంఖ్యను పెంచే దిశగా ప్రయత్నిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని భావిస్తోంది. మెడికోలకు హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పీజీ సీట్లు ప్రస్తుతం మనదగ్గర 8 ఉన్నాయి. వాటిని కూడా పెంచే దిశగా సర్కారు చర్యలు తీసుకుంటోంది. అవి పెరిగితే ఆస్పత్రి పాలనా బాధ్యతలను అడ్మినిస్ట్రేషన్‌ పీజీ చేసిన మెడికోలకు అప్పగించవచ్చని యోచిస్తోంది.

Updated Date - Oct 14 , 2025 | 03:24 AM