Khammam Devarapalli Greenfield Highway: తుది దశకు ఖమ్మం దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:46 AM
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకున్నాయి. జనవరిలో నూతన సంవత్సరం కానుకగా ఈ హైవేపై వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలు ప్రారంభించేందుకు....
జనవరిలోనే వైరా నుంచి జంగారెడ్డి గూడెం వరకు రాకపోకలు!
టోల్ టెండర్ల కోసం కసరత్తు.. ఎన్‌హెచ్‌ఏఐకి అధికారుల లేఖ
ఖమ్మం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకున్నాయి. జనవరిలో నూతన సంవత్సరం కానుకగా ఈ హైవేపై వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలు ప్రారంభించేందుకు నేషనల్ హైవే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు టోల్ టెండర్లు నిర్వహించాలని నేషనల్ హైవే అథారిటీకి జిల్లా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు లేఖ రాశారు. టోల్ టెండర్లు పూర్తిచేస్తే జనవరిలోనే ఖమ్మం జిల్లా వైరా నుంచి ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వరకు మొదటగా ఈ రహదారిని ప్రాంరభించి రాకపోకలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ జాతీయ రహదారిని ప్రతిపాదించారు. సుమారు 130కిలోమీటర్ల దూరంతో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను రూ.3500కోట్లతో చేపట్టగా.. ఐదేళ్లుగా సాగుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 3ప్యాకేజీలు, ఏపీలోని పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ప్యాకేజీల కింద ఈ పనులు చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి వైరా మండలం సోమవరం వరకు రహదారి పనులు పూర్తయ్యాయి అంటు జంగారెడ్డిగూడెం నుంచి దేవరపల్లి వరకు సుమారు 25కి.మీ మేర రహదారి నిర్మించాల్సి ఉంది. ఖమ్మం సమీపంలోని ధంసలాపురం వద్ద రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి పనులు, మున్నేరుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బోనకల్ రోడ్డుకు ఎగ్జిట్ పనులు కూడా నిర్మిస్తున్నారు. ఈ పనులు జనవరి నెలాఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నా కొంత ఆలసమ్యమయ్యే పరిస్థితి ఉంది. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల హైవే నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు నిర్మాణమైన జాతీయ రహదారిని రవాణా కోసం వినియోగించుకునేందకు త్వరగా టోల్ టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అధికారులు ప్రతిపాదనలు నేషనల్ హైవే అథారిటీకి పంపారు.