Share News

Khammam Congress Leaders Pledge Majority: స్థానిక ఎన్నికల్లో బీసీలకే అధిక సీట్లు

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:12 AM

పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవుల భర్తీలో కూడా సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు....

Khammam Congress Leaders Pledge Majority: స్థానిక ఎన్నికల్లో బీసీలకే అధిక సీట్లు

  • పార్టీ, ప్రభుత్వ పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తున్నాం

  • ఖమ్మం నూతన డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం

  • కొత్తగూడెంలో మన్మోహన్‌సింగ్‌ యూనివర్సిటీ: మంత్రి తుమ్మల

  • స్థానిక ఎన్నికల్లో వందకు వందశాతం సీట్లు కాంగ్రెస్సే గెలవాలి: పొంగులేటి

ఖమ్మం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవుల భర్తీలో కూడా సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం బీసీలకు అవకాశం కలిపిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్ల కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడు సముచిత న్యాయం కల్పించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలతోపాటు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నూతి సత్యనారాయణ సోమవారం ఖమ్మంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే పంచాయతీలు మరింత అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. పేదల కోసం రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారని విమర్శించారు. మహిళల ఆత్మగౌరవం పెంపొందించేలా ఇంటివద్దకే వెళ్లి బొట్టుపెట్టి కోటిమంది మహిళలకు చీరలు అందిస్తున్నామని తెలిపారు. రైజింగ్‌ తెలంగాణ-2047 నినాదంతో ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు.

ఐకమత్యంతో ముందుకెళ్లాలి: తుమ్మల

ఖమ్మం జిల్లా కాంగ్రె్‌సకు ఘనమైన చరిత్ర ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జలగం వెంగళరావు, బొమ్మకంటి సత్యనారాయణ, శీలం సిద్ధారెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారని, వారి స్ఫూర్తితో ముందుకు నడవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అక్కడక్కడ సమస్యలున్నా ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా కోసం కొత్త యూనివర్సిటీని కొత్తగూడెంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

స్థానిక ఎన్నికల్లో వందశాతం సీట్లు మనమే గెలవాలి: పొంగులేటి

స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు తాము అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు నూటికి నూరుశాతం గెలవాలని అన్నారు. కాంగ్రెస్‌ జిల్లా నూతన అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని పోతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాందా్‌సనాయక్‌, మట్టా రాగమయి, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 05:12 AM