Share News

kumaram bheem asifabad- రోడ్డెక్కిన కేజీబీవీ విద్యార్థినులు

ABN , Publish Date - Dec 20 , 2025 | 10:15 PM

కుమరం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంఽధీ బాలికల విద్యాలయంలో పని చేస్తున్న ఎస్‌వో(స్పెషల్‌ ఆఫీసర్‌)ను తొలగించాలని శనివారం విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ధర్నా చేశారు. అనుచిత వ్యాఖ్యలతో ఎస్‌వో తమను మానసిక వేధింపులకు గురి చేస్తోందని శనివారం తరగతులు బహిష్కరించి రోడ్డెక్కారు. తల్లిదండ్రులతో కలిసి మూకుమ్మడిగా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ‘

kumaram bheem asifabad- రోడ్డెక్కిన కేజీబీవీ విద్యార్థినులు
వాంకిడి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థినులు

వాంకిడి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంఽధీ బాలికల విద్యాలయంలో పని చేస్తున్న ఎస్‌వో(స్పెషల్‌ ఆఫీసర్‌)ను తొలగించాలని శనివారం విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ధర్నా చేశారు. అనుచిత వ్యాఖ్యలతో ఎస్‌వో తమను మానసిక వేధింపులకు గురి చేస్తోందని శనివారం తరగతులు బహిష్కరించి రోడ్డెక్కారు. తల్లిదండ్రులతో కలిసి మూకుమ్మడిగా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ‘ ఈ ఎస్‌వో మేడం మాకు వద్దంటే.. వద్దు.. కలెక్టర్‌ రావాలే, మాకు న్యాయం చేయాలే’ అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. ఎస్‌వో మేడం కొంతకాలంగా తీవ్ర పదజాలతో దూషిస్తోందని, దీని వల్ల తాము చదువుపై దృష్టి పెట్టలేక పోతున్నామని ఆవేదన చెందారు. జ్యోతిబాఫూలే చిత్రపటం ఎందుకు పెడుతున్నారు అంటూ బయట పడేసి మమ్ములను మాలీ కూలం పేరుతో దూషిస్తుందని విద్యార్థినులు ఆవేదనంగా చెప్పారు ఎస్‌వో తమను ఇష్టం వచ్చినట్లు తిట్టడమే కాకుండా తమతో పనులు చేయిస్తున్నదని ఆరోపించారు. ఎస్‌వోను తొలగించకపోతే ఇళ్లకు వెళ్తామే తప్ప పాఠశాలలో మాత్రం ఉండమని తేల్చిచెప్పారు. సెక్టోరల్‌ అధికారులు భాగ్యలక్ష్మి, ఆబిద్‌అలి, ఎస్సై మహెం దర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకోని విద్యార్థినులతో చర్చలు జరిపారు. తమ పట్ల ఎస్‌వో వ్యవహారిస్తున్న దురుసు ప్రవర్తనను సెక్టోరల్‌ అధికారులకు, ఎస్సైకు విద్యార్థినులు వివరించారు. విద్యార్థినులు చెప్పిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎస్‌వోపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఎస్‌వో సెలవుపై వెళ్లిందని అందరు పాఠశాలకు వెళ్లాలని చెప్పడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. విద్యార్థినులు చేసిన ఆందోళన కార్యక్రమానికి విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఎస్‌వో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎస్‌వో పై చర్యలు తీసుకోవాలని సెక్టోరల్‌ అధికారులకు, డిప్యూటీ తహసీ ల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Dec 20 , 2025 | 10:15 PM