Share News

RRR Project: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంలో కీలక అడుగు!

ABN , Publish Date - Oct 07 , 2025 | 02:52 AM

జినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం డీపీఆర్‌ విషయంలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. డీపీఆర్‌ జూన్‌లో కేంద్రానికి చేరిన సంగతి తెలిసిందే...

RRR Project: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంలో కీలక అడుగు!

  • డీపీఆర్‌ను పీపీపీ అప్రైజల్‌ కమిటీకి సిఫారసు చేసిన సాంకేతిక పరిశీలన కమిటీ

  • నెలాఖరుకల్లా ఆమోదించే అవకాశం!

  • అనంతరం కేంద్ర మంత్రివర్గం ముందుకు

హైదరాబాద్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం డీపీఆర్‌ విషయంలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. డీపీఆర్‌ జూన్‌లో కేంద్రానికి చేరిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు అప్రైజల్‌ సాంకేతిక పరిశీలన కమిటీ(పీఏటీఎస్సీ) తాజాగా ఈ డీపీఆర్‌ను పబ్లిక్‌- ప్రైవేటు- పార్టనర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పీపీపీఏసీ)కి సిఫారసు చేసింది. ఈ కమిటీలో కూడా ఈ నెలాఖరుకల్లా ప్రాజెక్టు ఆమోదం పొందనుందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. రెండు కమిటీల్లో ప్రక్రియ పూర్తవగానే ఉత్తరభాగం డీపీఆర్‌ కేంద్ర మంత్రి వర్గానికి చేరనుంది. పీఏటీఎస్సీ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) కేంద్ర కార్యాలయం పరిధిలో ఉంటుంది. ఇందులో ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, అవసరమైన సౌకర్యాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? టోల్‌ప్లాజాలు, రెస్ట్‌ఏరియాలు తదితర అంశాలన్నింటినీ పరిశీలిస్తారు. ఆ డీపీఆర్‌పై సంతృప్తి చెందడంతో తాజాగా పీపీపీఏసీకి సిఫారసు చేశారు. ఈ కమిటీ కేంద్ర రవాణా శాఖ పరిధిలో ఉంటుంది. ఇందులో కేంద్ర రవాణా, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు సహా మరో ముగ్గురు కీలక శాఖల ముఖ్య కార్యదర్శులు ఉంటారు. వీరంతా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలపై సమీక్షిస్తారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయని భావిస్తే వెంటనే ప్రాజెక్టు ఆమోదయోగ్యమేనంటూ కేంద్ర మంత్రివర్గానికి సిఫారసు చేస్తారు. ఇదే చివరి దశ. అయితే, అన్ని అంశాలనూ పరిశీలించాకే ఈ రోడ్డును మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌లోనూ త్వరగానే ఆమోదముద్ర పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

నిర్మాణ వ్యయం రూ.8వేల కోట్లు..

ఉత్తరభాగం సమగ్ర నివేదికలో ప్రాజెక్టు వ్యయం, భూ సేకరణ పరిహారం చెల్లింపులు, ఇతరత్రా అంశాలకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపర్చారు. ఈ క్రమంలో రహదారి నిర్మాణానికి దాదాపు రూ.8 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణం కోసం సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం దీనికి అదనంగా ఉంటుందని వివరించారు. భూ సేకరణ పరిహారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చెల్లించనున్నాయి. పరిహారం చెల్లింపునకు రూ.5,200 కోట్లు అవసరమని అంచనా. ఇక ఉత్తరభాగం మార్గాన్ని 6 వరసలతో నిర్మించనున్నారు. కేంద్ర క్యాబినెట్‌లో ప్రాజెక్టు ఆమోదం పొందగానే రహదారి నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించనున్నారు.

Updated Date - Oct 07 , 2025 | 02:52 AM