Komatireddy Venkat Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌పై 22న కీలక భేటీ
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:26 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)లో కీలక ముందడుగు పడనుంది. ఉత్తరభాగం టెండర్లు, దక్షిణభా గం అలైన్‌మెంట్ ఆమోదానికి సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి...
ఉత్తర భాగం టెండర్లు, దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశం
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)లో కీలక ముందడుగు పడనుంది. ఉత్తరభాగం టెండర్లు, దక్షిణభా గం అలైన్‌మెంట్ ఆమోదానికి సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్రం మంజూరు చేసిన పలు రహదారుల ప్రాజెక్టులపై ఈ నెల 22న కీలక సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరగబోయే సమావేశంలో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సమావేశంలో ప్రధానంగా రీజినల్ రింగు రోడ్డు ఉత్త రభాగంలో మిగిలిపోయిన భూ సేకరణ, ఇప్పటికే సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఉత్తర భాగంలో భూ సేకరణ పూర్తయిన వరకు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరనుంది. అలాగే, దక్షిణభాగానికి సంబంధించి ఖరారు చేసిన అలైన్‌మెంట్‌ను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనుంది. కాగా, ఈ సమావేశంలోనే మన్ననూర్- శ్రీశైలం రహదారి, ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అలైన్‌మెంట్లను కేంద్ర అధికారులకు వివరించనుంది. వీటికి అవసరమైన భూ సేకరణ, ఇతర అంశాలపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకోనున్న ట్టు తెలిసింది.
రోడ్ల అభివృద్ధి దిశగా చర్యలు
రాష్ట్రంలోని రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, ఉన్నతీకరణకు చర్యలు తీసుకుంటున్నాం. అదే సమయంలో ఇతర రాష్ట్రాలను కలిపేలా మరిన్ని రోడ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం.ఫ్యూచర్‌సిటీ-అమరావతి, మన్ననూర్-శ్రీశైలం మార్గాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం. హైదరాబాద్-విజయవాడ హైవేను 6వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ పనులు నడుస్తున్నాయి.
- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి