Share News

Maoist Leader Padmavati Surrender: జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు నేత పద్మావతి

ABN , Publish Date - Sep 14 , 2025 | 04:55 AM

మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన మహిళా నేత, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్‌ కల్పన అలియాస్‌ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, 2011లో మరణించిన మల్లోజుల కోటేశ్వరరా....

Maoist Leader Padmavati Surrender: జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు నేత పద్మావతి

  • ఈమె.. ఒకప్పటి అగ్రనేత కిషన్‌జీ భార్య

  • ప్రస్తుతం కేంద్ర కమిటీలో ఏకైక మహిళ

  • అనారోగ్యం నేపథ్యంలో లొంగుబాటు

  • 25లక్షల చెక్కు అందజేసిన డీజీపీ

హైదరాబాద్‌/గట్టు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన మహిళా నేత, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్‌ కల్పన అలియాస్‌ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, 2011లో మరణించిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ భార్య అయిన కల్పన స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు. పటేల్‌ తిమ్మారెడ్డి, వెంకమ్మలకు పద్మావతి రెండో సంతానం. పీపుల్స్‌వార్‌ నేతలు పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, పోతుల సుదర్శన్‌ రెడ్డికి దగ్గరి బంధువైన కల్పన.. వారి ఆలోచనలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై 1982లో పీపుల్స్‌వార్‌లో చేరారు. తొలుత ఆమె రాడికల్‌ విద్యార్థి సంఘం తరఫున గ్రామ స్థాయి కార్యకర్తగా పని చేశారు. తర్వాత జన నాట్య మండలిలో గద్దర్‌, సంజీవ్‌ బృందంలో పని చేశారు. పీపుల్స్‌ వార్‌ ఆధ్వర్యంలో కొనసాగిన పీస్‌ బుక్‌ సెంటర్‌లో ఏడాది పాటు పనిచేశారు. అదే సమయంలో ఆమెకు కిషన్‌ జీతో పరిచయం ఏర్పడింది. 1984లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1987లో కిషన్‌జీ, కల్పనకు గడ్చిరౌలిలో కీలక బాధ్యతలను పార్టీ అప్పజెప్పింది. 2023లో కేంద్ర కమిటీ సభ్యురాలయ్యారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో ఏకైక మహిళా నాయకురాలిగా ఉన్న ఆమె.. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నా రు. గతేడాది అక్టోబరులో చికిత్స కోసం హైదరాబాద్‌వస్తుండగా.. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. ఇక, 3 నెలల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటున్న విషయా న్ని కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు ద్వారా కేంద్ర కమిటీకి ఆమె తెలియజేశారు. 43 ఏళ్ల ఉద్యమ జీవితం తర్వా త జనజీవన స్రవంతి వైపు అడుగులు వేశారు. ఆమె పై 106 కేసులుండగా.. రూ.25 లక్షల రివార్డు ఉంది. డీజీపీ జితేందర్‌ సమక్షంలో శనివారం కల్పన లొంగిపోగా.. పునరావాస ప్యాకేజీ కింద రూ.25లక్షలను అందజేశారు.


హింసాత్మక పోరాటాలకు కాలంచెల్లింది: సంజయ్‌

దేశంలో హింసాత్మక పోరాటాలకు కాలం చెల్లిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ీ సుజాత లొంగుబాటే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కోరారు.

గరియాబంద్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం: గడ్డం లక్ష్మణ్‌

నల్లకుంట, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం అని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని, గరియాబంద్‌ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. హైదర్‌గూడలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సాయుధ బలగాలు దండకారణ్యంలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు.


లొంగిపోతే.. అన్ని విధాలా సాయం: డీజీపీ

పోరు వద్దు-ఊరు ముద్దు అంటూ ఆయుధాలను వదిలిసి లొంగిపోయే మావోయిస్టులకు అన్ని విధాలా సాయం చేస్తామని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాలకు చెందిన 404 మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీలో 73 మంది మాత్రమే ఉన్నారని, వారిలో 11మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగతా వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 15మంది సభ్యుల్లో.. పది మంది తెలంగాణ వారని చెప్పారు. వీరందరూ ఆయుధాలు వదిలేసి.. జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. తమవల్ల పోలీసు బలగాలకు జరుగుతున్న నష్టాన్ని బయటకు వెల్లడించడం లేదం టూ ఇటీవల మావోయిస్టు పార్టీ ప్రకటనపై విలేకరులు ప్రశ్నించగా.. కర్రెగుట్టల ఎన్‌కౌంటర్‌లో క్రాస్‌ ఫైరింగ్‌ వల్లే గ్రేహౌండ్స్‌ కానిస్టేబుళ్లు మరణించారని, మావోయిస్టుల దాడిలో కాదని డీజీపీ స్పష్టం చేశారు. కాగా, మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజా సంఘాలు కోరుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ వైఖరి ఏంటన్న ప్రశ్నపై ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌ రెడ్డి స్పందిస్తూ చర్చల అంశం కేంద్రం పరిధిలోనిదని తెలిపారు.

Updated Date - Sep 14 , 2025 | 06:19 AM