Share News

Telangana Govt: స్థానిక ఎన్నికలపై ముందుకెలా

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:54 AM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

Telangana Govt: స్థానిక ఎన్నికలపై ముందుకెలా

  • 2 రోజుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం

  • బీసీ రిజర్వేషన్లు, స్థానిక సమరంపై మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

  • జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్దామన్న కొందరు.. పార్టీ పరంగా వెళ్దామన్న మరికొందరు

  • 42ు పై జీవో ఇవ్వడంపైనా చర్చ

  • తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే

  • దీనిపై రేపు సీఎస్‌ కీలక సమావేశం!

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమావేశమయ్యారు. తమ ముందున్న మూడు రకాల అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగాతమ అభిప్రాయాలు తెలిపిన మంత్రులు.. తుది నిర్ణయాన్ని మాత్రం ముఖ్యమంత్రికే వదిలేశారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే సీఎం తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. మరోవైపు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముఖ్య సమావేశం జరగనున్నట్లు తెలిసింది. దీంతో స్థానిక ఎన్నికల విషయంలో వేగం పెంచే దిశగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా.. అన్న చర్చ మొదలైంది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బిల్లులు ఇంకా ఆమోదం పొందని విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ల ఖరారు వ్యవహారం తేలడంలేదు. దాంతో స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో జరిపిన సమావేశంలో.. సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్న అంశంతోపాటు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం, లేదా జీవోలు విడుదల చేసి అధికారికంగా 42 శాతం రిజర్వేషన్‌ కల్పించి ఎన్నికలకు వెళ్లడమనే మూడు అంశాలపై చర్చించారు.


చిత్తశుద్ధితో ధైర్యంగా ముందుకెళదాం..

‘బీసీ రిజర్వేషన్లు, స్థానిక సమరంపై ఎలా ముందుకెళ్దాం? ఏం చేద్దాం?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రుల అభిప్రాయం కోరారు. దీనిపై కొందరు మంత్రులు మాట్లాడుతూ, ‘‘రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఇక్కడ గవర్నర్‌, అక్కడ రాష్ట్రపతి ఆమోదించలేదు. అలాగని తిరస్కరించనూ లేదు. అదే సమయంలో కేంద్రం వాటిని ఆమోదించేలా చర్యలు తీసుకుంటుందా అన్నదీ తెలియదు. అందుకే బిల్లును ఆమోదించే వరకు పోరాటం చేద్దాం’’ అని అన్నట్లు తెలిసింది. రిజర్వేషన్ల వ్యవహారం అధికారికంగా తేలాకే ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్టు సమాచారం. మరికొందరు మంత్రులు మాత్రం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళదామని అనడంతో.. దీనిపై తలెత్తే న్యాయపరమైన సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. ఇందుకోసం న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తమ్మీద స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించే విషయంలో చిత్తశుద్ధితో ధైర్యంగా ముందుకెళదామని మంత్రులు అన్నట్టు తెలిసింది. దీనిపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కాగా, మంత్రులతో సీఎం నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య అధికారులు.. ఎన్నికల ప్రక్రియ, రిజర్వేషన్ల వ్యవహారాన్ని వివరించారు.


  • మేడారం పనులపై సాంకేతిక కమిటీ

  • ఆదివాసీల సంప్రదాయాలను గౌరవిస్తాం

  • పూజారుల కోరిక మేరకు ఆలయ విస్తరణ

  • అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

ములుగు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మేడారం జాతర పనులపై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై సచివాలయంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆదివాసీ పూజారుల సంప్రదాయాలను గౌరవిస్తామని, వారి కోరిక మేరకు విస్తరణ పనులను చేపడతామన్నారు. సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను యథాతథంగా ఉంచుతామని పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లను రూపొందించాలన్నారు. కాగా, ఈ నెల 23న సీఎం రేవంత్‌రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు.

Updated Date - Sep 21 , 2025 | 07:04 AM