Share News

BRS chief KCR: 19న కేసీఆర్‌ అధ్యక్షతన కీలక భేటీ

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:26 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ఈ నెల 19న ఆ పార్టీ శాసనసభా పక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది...

BRS chief KCR: 19న కేసీఆర్‌ అధ్యక్షతన కీలక భేటీ

హైదరాబాద్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ఈ నెల 19న ఆ పార్టీ శాసనసభా పక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణకు పార్టీపరంగా చేపట్టాల్సిన ఉద్యమాలు, ప్రజల్లోకి వెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు కేసీఆర్‌ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గోదావరి, కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం కొల్లగొడుతున్నా.. దాన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్‌ సర్కార్‌ విఫలమైందని ఆ ప్రకటనలో విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్‌ హయాంలో 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలంటోందన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కేంద్రం వద్ద మోకరిల్లి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. 8 మంది బీజేపీ ఎంపీలున్నా ప్రయోజనం లేదన్నారు. బీఆర్‌ఎ్‌సలో చోటుచేసుకున్న పరిణామాలు, అంతర్గత సమస్యలపై కూడా పార్టీ ముఖ్యులతో కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 15 , 2025 | 04:26 AM