Former CM KCR: ఈ సారైనా జనంలోకి వస్తారా?
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:30 AM
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తాజా వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది
కేసీఆర్ వీడియోలతో సోషల్ మీడియాలో సెటైర్లు
హైదరాబాద్, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తాజా వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అన్నమాట ప్రకా రం ఆయన ఈసారైనా జనంలోకి వస్తారా? ఇలా బె దిరించి అలా వెళ్లిపోతారా? అన్న సందేహాన్ని ఆయా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ 2024లో నల్లగొండ సభలో ‘ఈడికెళ్లి నేనుగూడ ఊకోను.. నేను బయలుదేరుతా.. ఎందాకైనా మంచిదే’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌కు హెచ్చరిక చేశారు. రైతాంగ సమస్యలు, కృష్ణా జలాలు ప్రధాన అంశంగా పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్య లు చేశారు. ఆ తర్వాత జనంలోకి వెళ్లిందే లేదు. తా జాగా సోమవారం మీడియా సమావేశంలో ‘రెండేళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు బయలుదేరిన.. ఇయ్యాలటి నుంచి వేరుకథ.. రేపటి నుంచి మరోకథ.. తోలు తీస్తా..’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌కు ఘాటుగా హెచ్చరికలు చేశారు. అదే రోజు సాయంత్రానికి ఎర్రవెల్లి ఫాంహౌ్‌సకు చేరుకున్నారు. కాగా, నెటిజన్లు ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆయా సందర్భాల్లో కేసీఆర్ వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌లను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఇదే విషయంపై బీఆర్‌ఎస్ శ్రేణుల్లోనూ చర్చ కొనసాగుతోంది. ఒక ప్రెస్‌మీట్ పెట్టి కాంగ్రెస్ అసమర్థతపై కేసీఆర్ ప్రశ్నలు సంధిస్తే ప్రజల్లో ఎక్కడలేని మైలేజీ వచ్చిందని, చెప్పిన ప్రకారం తమ బాస్ ఇక నుంచి ప్రజల్లోనే ఉంటే పార్టీకి ఎంతో లాభం చేకూరుతుందని గులాబీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు.. ‘నాలుగు గోడల మధ్య ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడటం కాదు.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. వచ్చి మాట్లాడాల’ని అధికార కాంగ్రెస్ నేత లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత ఏం చేయనున్నారు?.. కృష్ణా జలాలు, పాలమూరు ప్రాజెక్టు అంశంతో ఆయన ప్రజల్లోకి వెళ్తారా? మరో ఉద్యమానికి సిద్ధమవుతారా? అని ఆయా వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.