BRS chief K. Chandrashekar Rao: నేడు అసెంబ్లీకి కేసీఆర్
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:52 AM
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ నుంచి నంది నగర్‌లోని తన నివాసానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు..
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ నుంచి నంది నగర్‌లోని తన నివాసానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఇప్పటి వరకు ‘సారొస్తారా? అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా..’ అంటూ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలకు గులాబీ పార్టీ బ్రేక్ వేసింది. ‘ఔను మా సారొస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు’ అని బీఆర్‌ఎస్ వర్గాల కథనం. సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని తెలుస్తున్నా.. సమావేశాలు జరిగినన్ని రోజులు పాల్గొంటారా..? ఒక్కరోజుకే పరిమితం అవుతారా..? అన్న విషయమై మాత్రం బీఆర్‌ఎస్ నాయకత్వం స్పష్టతనివ్వడం లేదు. ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్న సమాచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఇటీవల తెలంగాణ భవన్ వేదికగా మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఇయ్యాలటి వరకు ఓ కథ. రేపటి నుంచి మరో కథ. తోలు తీస్తా’ అని కాంగ్రెస్ సర్కారుకు ఘాటు హెచ్చరికలు చేశారు. ప్రతిగా అధికార పక్షం విమర్శలతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణా జలాల్లో వాటా, పాలమూరు-రంగారెడ్డి పథకంపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం.. దాంతో ఆయా జిల్లాలకు జరిగే నష్టంపై కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడంతోపాటు క్షేత్రస్థాయి కార్యాచరణ సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్తారని బీఆర్‌ఎస్ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతానన్న వ్యాఖ్యకు కేసీఆర్ కట్టుబడి ఉంటారా..? ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి హాజరవుతారా? అని రాజకీయ వర్గాలో చర్చ జరుగుతోంది.