Harish Rao comments: కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ పడగొట్టిండు
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:23 AM
కేసీఆర్ సాగు భాష మాట్లాడితే, రేవంత్‌రెడ్డి చావు భాష మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై కేసులు, ఫార్మాసిటీ భూముల సేకరణపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శించారు.

పటాన్‌చెరు రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్‌ది సాగు భాష అయితే, రేవంత్‌రెడ్డిది చావు భాష. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే, రేవంత్‌రెడ్డి పడగొట్టిండు’’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారని, కాంగ్రెస్ ఏడాది పాలనలోనే పాలేవో.. నీళ్లేవో ప్రజలకు అర్థమైపోయిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ నుంచి రుద్రారం వినాయకుడి ఆలయం వరకు బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శరెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరయ్యారు. వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ అడవులను నరికి, మూగజీవాల ఉసురు పోసుకుంటున్న రేవంత్‌రెడ్డి.. విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టినందుకు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ భూములన్ని రైతులకు ఇప్పిస్తామని చెప్పినే రేవంత్.. ఇప్పుడేమో ఫార్మా సిటీ కోసం 16 వేల ఎకరాలను సేకరిస్తామంటున్నారు’’ అని ఎద్దేవా చేశారు.