Professor Kodandaram: తెలంగాణ సాధనలో కేసీఆర్‌ది ఒక పాత్ర మాత్రమే
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:39 AM
తెలంగాణ సాధనలో కేసీఆర్‌ది ఒక పాత్ర మాత్రమేనని, ఆయన వల్లే రాష్ట్రం వచ్చిందనేది అంగీకరించే విషయం కాదని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు...
బీఆర్‌ఎస్ హయాంలో భయంతో ఉద్యమకారుల మౌనం: కోదండరాం
కవాడిగూడ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాధనలో కేసీఆర్‌ది ఒక పాత్ర మాత్రమేనని, ఆయన వల్లే రాష్ట్రం వచ్చిందనేది అంగీకరించే విషయం కాదని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులు భయంతో నోరు ఎత్తలేకపోయారని ఆయన విమర్శించారు. ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, అందుకోసం ఉమ్మడి కార్యచరణ రూపొందించాలని కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో కోదండరాం, హరగోపాల్, గాలి వినోద్‌కుమార్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్‌యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యమకారుల డిమాండ్ల సాధన కోసం అందరూ ఒకే వేదికపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 15న జన సమితి రాష్ట్ర కార్యాలయంలో ఉద్యమకారుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి కార్యచరణ రూపొందించి ముందుకు సాగుదామన్నారు. హరగోపాల్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఒక వ్యక్తి తెలంగాణ తీసుకువచ్చారని ప్రచారం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. అందరి పోరాటాల వల్లనే తెలంగాణ ఆవిర్భవించిందని ఆయన స్పష్టం చేశారు. సౌత్‌ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ గాలి వినోద్‌కమార్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ భూకబ్జాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ మరో 500మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కార్యచరణ ప్రణాళిక సిద్ధంగా ఉన్నదని చెప్పారు.