Share News

KCR Holds Key Meeting: కేసీఆర్‌తో హరీశ్‌, కేటీఆర్‌ భేటీ..!

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:39 AM

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌..

KCR Holds Key Meeting: కేసీఆర్‌తో హరీశ్‌, కేటీఆర్‌ భేటీ..!

  • ఫార్ములా ఈ వ్యవహారంపై సమాలోచన

  • తాజా రాజకీయ పరిణామాలపైనా కీలక చర్చ

  • అంతకుముందు హరీశ్‌ ఇంటికి వెళ్లిన కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బుధవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తాజాగా ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంపై సిద్ధం చేసిన ఫైల్‌ను ప్రభుత్వం సీఎస్‌ ద్వారా.. గవర్నర్‌కు పంపుతున్న నేపథ్యంలో అది ఎలా ఉండబోతుందన్న దానిపై వారు సమాలోచన చేసినట్లు సమాచారం. గవర్నర్‌కు అందించిన సమాచారం.. తదుపరి ప్రభుత్వం ఏ విధమైన చర్యలకు సిద్ధమవుతుందో.. దాన్నిబట్టి స్పందించాలని, సందర్భాన్ని బట్టి న్యాయనిపుణుల సలహాలు తీసుకొని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలన్న నిర్ణయంపైనా.. వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నిక, పార్టీ వ్యవహారాలు, ఇతర రాజకీయ అంశాలపై కూడా సమాలోచన చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా.. అంతకుముందు కేటీఆర్‌.. హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించుకున్న ఆ ఇద్దరు నేతలు.. కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 11 , 2025 | 05:39 AM