KCR Government Accused: కేసీఆర్ హయాంలో.. ఓటర్ల సమాచారం దుర్వినియోగం
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:33 AM
కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాను చేజిక్కించుకుని, ప్రభుత్వ పథకాల కోసం దానిని దుర్వినియోగం చేసిందని ఎన్నికల ప్రధానాధికారి....
ఆధార్‌తో లింకు కోసం మా నుంచి డేటా తీసుకుంది
ఆరేళ్లపాటు సమాచారాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంది
పౌరుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసింది
చివరికి దానిని ప్రైవేటు కంపెనీలకూ అప్పగించింది
కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాష్ట్ర సీఈవో
దీనిపై 2019లోనే ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు
ప్రజల సమాచారమంతా పోసిడెక్స్ కంపెనీ చేతుల్లోకి..
అప్పట్లో ఖండించిన సర్కారు.. ఇప్పుడు నిజమని నిర్ధారణ
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి వినియోగం
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాను చేజిక్కించుకుని, ప్రభుత్వ పథకాల కోసం దానిని దుర్వినియోగం చేసిందని ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి(సీఈసీ) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.16 లక్షల మంది పింఛనుదారులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ గుర్తింపు ద్వారా ఎంపిక చేసిందని, వారి ఫొటోలు, చిరునామా తదితర వివరాలను దుర్వినియోగం చేసిందన్నారు. ఈ మేరకు సీఈసీకి ఇటీవల లేఖ రాశారు. ‘‘ఓటరు కార్డు సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానిస్తామని, అందుకు మీ వద్ద ఉన్న ఓటరు గుర్తింపు కార్డుదారుల సమాచారాన్ని ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల సంఘం సర్వర్ల ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఐటీ శాఖ తన సర్వర్లను ఇందుకు ఉపయోగించింది. దాంతో, సమాచారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. 2015 నుంచి జూలై 2021 వరకు ఎన్నికల సంఘం వద్ద ఉన్న రాష్ట్ర పౌరుల ఓటరు కార్డు సమాచారమంతా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. తర్వాత.. ఆ సమాచారాన్ని వినియోగించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం దానిని తనవద్దే ఉంచుకుంది. సరికదా.. సీఈవోకు సమాచారం ఇవ్వకుండా దానిని అక్రమంగా ఉపయోగించుకుంది. అంతేనా, పింఛను పథకానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను రూపొందించడానికి ఆ సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది’’ అని ఆ లేఖలో పేర్కొంది.
ఎన్నికల సంఘం తాజా లేఖ ద్వారా రాష్ట్రంలోని పౌరుల వ్యక్తిగత సమాచారమంతా దుర్వినియోగమవుతోందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఐటీ శాఖ సమాచార చౌర్యానికి పాల్పడుతోందని ‘ఆంధ్రజ్యోతి’ 2019 నవంబరు 1, 2 తేదీల్లో ప్రచురించిన ప్రత్యేక కథనాలు నిజమని తేలింది. ఎంతో భద్రంగా ఉంచాల్సిన ప్రజల సమాచారమన్ని అప్పట్లో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పోసిడెక్స్ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించిందని, ఆ కంపెనీ అప్పట్లో మీసేవ కమిషనర్‌గా చేసిన గౌరవెల్లి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులదేనని ‘ఆంధ్రజ్యోతి’ ఆధారాలతో సహా కుండబద్దలు కొట్టినా.. గత ప్రభుత్వం స్పందించలేదు. పైగా, ‘ఆంధ్రజ్యోతి’ అసత్య కథనాలు ప్రచురిస్తోందని, ప్రభుత్వంపై బురద చల్లుతోందని అప్పటి ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆరోపించారు. అయితే, తాజాగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. ఐదారేళ్లపాటు గత ప్రభుత్వం పాల్పడిన సమాచార చౌర్యం నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి.
సమాచారమంతా ‘పోసిడెక్స్’ చేతుల్లోకి
ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి ఎన్నికల సంఘం పౌరుల నుంచి సేకరించే సమాచారమంతా కేంద్ర ఎన్నికల సంఘం సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ప్రజల వ్యక్తిగత సమాచారం కావడంతో అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా, దుర్వినియోగం కాకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటారు. ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న పౌరుల సమాచారంతోపాటు తాను సేకరించిన సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భద్రంగా ఉంచాల్సి ఉంది. కానీ, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దీనిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్ కంపెనీ ‘పోసిడెక్స్’కు అప్పగించింది. ఈ కంపెనీ గత ప్రభుత్వంలో ఐటీ శాఖలో కీలకంగా వ్యవహరించిన మీసేవ కమిషనర్ గౌరవల్లి వేంకటేశ్వర్ కుటుంబ సభ్యులది. ఆయన తల్లి గౌరవల్లి లీలాకుమారి, తమ్ముడు గౌరవల్లి వేణుగోపాల్ ఈ కంపెనీ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లో ఆధారాలతో సహా ప్రచురించింది. ప్రజల సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై వరుస కథనాలు వెలువరించింది. వాటిని గత ప్రభుత్వం అవాస్తవ కథనాలు అంటూ కొట్టిపారేసింది.
కానీ, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఈవో రాసిన లేఖలో కూడా ‘పోసిడెక్స్’ కంపెనీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. నిజానికి, అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని గత ప్రభుత్వం టి-యాప్ పేరుతో సేకరించింది. టి-యాప్ సేకరించిన సమాచారంతోపాటు ఎన్నికల సంఘం నుంచి సేకరించిన ఓటరు సమాచారాన్ని పింఛనుదారుల వివరాలను రాబట్టడానికి కలిపిందని, ఈ ప్రక్రియంతా ప్రైవేటు కంపెనీ పోసిడెక్స్ ఆధ్వర్యంలో జరిగిందని.. గతంలో ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిన విషయాన్నే తాజాగా ఎన్నికల సంఘం పేర్కొంది. 2018లో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం వెనక.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం కూడా ఉందని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో నిజం ఉందని తాజాగా ఈసీ ప్రకటనతో తెలుస్తోంది.