Share News

KCR: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:17 AM

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రగతిబాట పట్టిన గ్రామాలన్నీ కాంగ్రెస్‌ పాలనలో కునారిల్లిపోతున్నాయని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని....

KCR: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే

  • అన్ని కాలాలు ఒకేలా ఉండవ్‌: కేసీఆర్‌

  • కేసీఆర్‌ దత్తత గ్రామాల్లో ఏకగ్రీవం

  • బీఆర్‌ఎస్‌ అధినేతను కలిసిన ఎర్రవల్లి, నర్సన్నపేట నూతన సర్పంచ్‌లు

హైదరాబాద్‌, మర్కుక్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రగతిబాట పట్టిన గ్రామాలన్నీ కాంగ్రెస్‌ పాలనలో కునారిల్లిపోతున్నాయని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గ్రామాలకు తిరిగి మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్న ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామ సర్పంచ్‌ స్థానాలతోపాటు ఆ గ్రామాల్లోని పలు వార్డు మెంబర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి సర్పంచ్‌గా ఎన్నికైన కవిత, నర్సన్నపేట సర్పంచ్‌గా ఎన్నికైన బాల్‌నర్సయ్య, పలువురు వార్డు సభ్యులు సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైనవారిని మాజీ సీఎం సత్కరించి అభినందించారు. అనంతరం ఆ సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని కాలాలు ఒకేలా అనుకూలంగా ఉండవని, కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయని, వాటిని దైర్యంగా ఎదుర్కోవాలని కేసీఆర్‌ ఉద్బోధించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్థి చేసుకుంటూ ముందడుగు వేయాలని, గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఎవరో ఏదో చేస్తారని ఆశించకుండా.. గంగదేవిపల్లిలాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని పని చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, ప్రజాప్రతినిధులు తమ పల్లెల ప్రగతికి కృషి చేయాలన్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తిదాత ప్రొఫెసర్‌ యూని్‌సతోపాటు దేశానికే చెందిన అన్నా హజారే వంటి వారి కృషిని కేసీఆర్‌ ఈ సందర్భంగా వారికి వివరించారు.

Updated Date - Dec 06 , 2025 | 05:18 AM