Share News

Vedire Sriram: కేసీఆర్‌ సంతకం రాష్ట్రానికి మరణశాసనమైంది!

ABN , Publish Date - Dec 24 , 2025 | 05:46 AM

పదేళ్ల క్రితం జరిగిన ఒప్పందంలో కృష్ణా జలాల్లో తెలంగాణాకు 299 టీఎంసీలకే అప్పటి సీఎం కేసీఆర్‌ సంతకం చేయడం రాష్ట్రానికి మరణశాసనమైందని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మాజీ సలహాదారు....

Vedire Sriram: కేసీఆర్‌ సంతకం రాష్ట్రానికి మరణశాసనమైంది!

  • కృష్ణాలో 299టీఎంసీలే చాలని చెప్పారు

  • ట్రైబ్యునల్స్‌లో వాదించి ఉన్నా కనీసం 400-450 టీఎంసీలు దక్కి ఉండేవి

  • 2015 ఒప్పందంలో పాలమూరు వాటా ఎందుకు అడగలేదు?

  • కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరాం

హైదరాబాద్‌, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పదేళ్ల క్రితం జరిగిన ఒప్పందంలో కృష్ణా జలాల్లో తెలంగాణాకు 299 టీఎంసీలకే అప్పటి సీఎం కేసీఆర్‌ సంతకం చేయడం రాష్ట్రానికి మరణశాసనమైందని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మాజీ సలహాదారు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరాం అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రెండ్రోజుల క్రితం మాట్లాడిన కేసీఆర్‌, 2015లో జరిగిన కృష్ణా జలాల వాటా ఒప్పందం సమావేశంలో ఎందుకు ఆ ప్రాజెక్టుకు నీరు అడగలేదని నిలదీశారు. కేంద్రం ప్రకటించిన కొత్త ట్రైబ్యునల్‌ ద్వారానే కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన, ‘‘కృష్ణా జలాలు-తెలంగాణ వాటా’’ అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో 500 టీఎంసీల వాటా కోసం పట్టుబట్టాల్సిన సమయంలో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, 299టీఎంసీలకే ఒప్పుకొని సంతకాలు చేయడం తెలంగాణకు నష్టం చేసిందని పేర్కొన్నారు. ట్రైబ్యునల్స్‌లో సమర్థంగా వాదించి ఉంటే కనీసం 400-450 టీఎంసీలు పొందే అవకాశం ఉండేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, కోయిల్‌సాగర్‌ వంటి ప్రధాన ప్రాజెక్టులకు కనీసం 261.7 టీఎంసీలు అవసరమని, ఈ నీటిని ఒప్పందంలో చేర్చకపోవడం ఘోర తప్పిదమన్నారు. 299 టీఎంసీలు ఒక్క సంవత్సరానికే అన్న బీఆర్‌ఎస్‌ వాదన పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ 2016లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కూడా కేసీఆర్‌ సంతకాలు చేశారని, ఇందుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయన్నారు. 2016 నుంచి 2020 వరకు ఏటా 299 టీఎంసీల వాటాను కొనసాగిస్తూ సంతకాలు జరిగాయన్నారు. పైగా గడచిన పదేళ్లలో ఒక్క ఏడాది కూడా తెలంగాణ 299 టీఎంసీలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ప్రాజెక్టులు పూర్తయినట్లు చెబుతున్నా, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించలేదన్నారు.


అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కేసీఆర్‌ ఆలస్యం చేయడం వల్లే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు వర్క్‌ ఆర్డర్‌లు ఇచ్చే అవకాశం లభించింది. అని పేర్కొన్నారు. కేసీఆర్‌ మంకుపట్టు పట్టడం వల్ల కొత్త ట్రైబ్యునల్‌కు సంబంధించి టర్మ్స్‌ ఆఫ్‌ రిఫెరెన్సు ఏడెనిమిదేళ్లు ఆలస్యమైందన్నారు. ఈలోపు పోతిరెడ్డిపాడు సామర్థ్యం 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెరిగిందన్నారు. కొత్త ట్రైబ్యునల్‌ కావాలంటే సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని 2021లో అప్పటి జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, నాటి సీఎం కేసీఆర్‌కు చెప్పారని.. ఆ తర్వాత ఏడాదికి కేసీఆర్‌ కేసు ఉపసంహరించుకున్నారన్నారు. అనంతరం, కొత్త టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ రూపొందించడానికి మాకు ఏడాది, రెండేళ్లు పట్టిందన్నారు. ‘బచావత్‌ ట్రైబ్యునల్‌, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. బ్రజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ మరో 194 టీఎంసీలు కేటాయించింది. దీంతో, మొత్తం 1,005 టీఎంసీలుఉమ్మడి ఏపీకి కేటాయించారు. ఇది, 2014వరకు ఉన్న పరిస్థితి’ అని ఆయన పేర్కొన్నారు.

విభజన చట్టం పరిమితుల వల్లే అన్యాయం

ఏపీ విభజన చట్టం- 2014లోని పరిమితుల వల్లే తెలంగాణాకు అన్యాయం జరిగిందని శ్రీరాం ఆరోపించారు. ‘‘ఈ చట్టం రూపకల్పన సందర్భంగా అప్పటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం, కృష్ణా జలాల వాటా పంపిణీకి సంబంధించి బచావత్‌ ట్రైబ్యునల్‌ను టచ్‌ చేయరాదు. అంటే, ఉమ్మడి ఏపీలో కేటాయించిన జలాలే తప్ప, కొత్త కేటాయింపులేవీ లేవు. ఇది. తెలంగాణాకు జరిగిన అన్యాయం.. కాంగ్రెస్‌ నిర్వాకమే ఇది. దీనిని సరిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం, 2023 అక్టోబరు 6న కొత్త ట్రైబ్యునల్‌కు సంబంధించి టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్సు ఇస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తద్వారా, కృష్ణా బేసిన్‌ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజన చేసే అవకాశం ఏర్పడింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, టెక్నికల్‌, లీగల్‌ వాదనలు సమర్థంగా వినిపించకపోతే ఈ అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 05:46 AM