Kavitha condemned BJP and Congress: బీజేపీ, కాంగ్రెస్‌ల తీరు.. హంతకులే నివాళులర్పించినట్లుంది
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:20 AM
దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్.. బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ.. బంద్‌కు మద్దతు తెలపడం చూస్తుంటే హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లుందని...
తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం: కవిత
బీసీ బంద్‌లో పాల్గొన్న కవిత తనయుడు ఆదిత్య
దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్.. బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ.. బంద్‌కు మద్దతు తెలపడం చూస్తుంటే హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామ చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే బీసీల రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందన్నారు. బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌కు మద్దతు ప్రకటించిన కవిత.. జాగృతి, యూపీఎఫ్ నాయకులతో కలిసి ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజంగా బీసీ రిజర్వేషన్ల పై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మోదీ కాళ్లు పట్టుకునైనా రిజర్వేషన్లు సాధించాలని డిమాండ్ చేశారు. 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తదని, ఈ విషయంలో బీజేపీ ఎంపీలు నిర్లక్ష్యం వహిస్తే, వారి ఇళ్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేపడతామని కవిత అన్నారు. కాగా, కేసీఆర్ మరో రాజకీయ వారసత్వం రాష్ట్ర రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసింది. తాజాగా బీసీ బంద్‌లో కవితతో పాటు ఆమె పెద్ద కుమారుడు ఆదిత్య(21) పాల్గొన్నారు. ప్లకార్డు చేతపట్టి నినాదాలు చేశారు. ఇటీవలే అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆదిత్యకు రాజకీయాలంటే తల్లికిమాదిరిగానే ఆసక్తి. బీసీల కోసం తనతల్లి చేస్తున్న ఉద్యమాలకు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాల్సిన అవసరముందని ఆయన అన్నారు.