Kavitha to Launch New Party: కవిత కొత్త పార్టీ
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:22 AM
బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఆ పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని, తానే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి ఏ పేరు పెట్టాలన్నదానిపై ఆమె పలువురితో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ నినాదంతో...
టీబీఆర్‌ఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు!
లేదంటే తెలంగాణ రాజ్య సమితి పేరుతో?
బీఆర్‌ఎస్‌తో పూర్తిగా తెగదెంపులు
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం
నేడు భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి సస్పెన్షన్ దుర్మార్గం: జాగృతి శ్రేణులు
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఆ పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని, తానే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి ఏ పేరు పెట్టాలన్నదానిపై ఆమె పలువురితో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ నినాదంతో ఏర్పడిన టీఆర్‌ఎ్‌సలోని ‘టీ’ అక్షరాన్ని తొలగించి బీఆర్‌ఎ్‌సగా మార్చడాన్ని దృష్టిలో ఉంచుకొని.. తాను పెట్టబోయే పార్టీ తెలంగాణ (టీ)తో మొదలయ్యేలా.. పలు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జాగృతి శ్రేణులు చెబుతున్న ప్రకారం.. కవిత పెట్టనున్న పార్టీ పేరును ‘టీబీఆర్‌ఎ్‌స’గా నిర్ణయిస్తారని, దానికి పూర్తిపేరు ‘తెలంగాణ భారత రాష్ట్ర సమితి’ అని ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే టీబీఆర్‌ఎస్ పేరుతోనే ‘తెలంగాణ బహుజన రాష్ట్రసమితి’ అని నిర్ణయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
అదీ కాకపోతే.. టీఆర్‌ఎస్ పేరు కలిసొచ్చేలా.. ఇప్పటికే గుర్తింపు పొందని పార్టీల విభాగంలో రిజిస్టర్ అయిన ‘తెలంగాణ రాజ్య సమితి’ పార్టీని ఆమె తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా తన ‘తెలంగాణ జాగృతి’ సంస్థనే రాజకీయ పార్టీగా కవిత మారుస్తారని అందరూ భావించారు. అయితే ఉద్యమ సమయంలో స్వచ్ఛంద సంస్థగా జాగృతిని ఏర్పాటు చేసినందున.. దానిని అలాగే కొనసాగిస్తూ కొత్తగా పార్టీ పెట్టాలని కవిత భావిస్తున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం నుంచి ప్రేరణపొంది.. జాగృతి సంస్థను 2006లో కవిత నెలకొల్పారు. రెండు దశాబ్దాలుగా జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు ఓవైపు కృషి చేస్తూనే.. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..!
బీఆర్‌ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ అధిష్ఠానం తన ఎమ్మెల్సీ పదవిపై ఫిర్యాదు చేయడానికి ముందే రాజీనామా చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎ్‌సతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడంతోపాటు భవిష్యత్తు కార్యాచరణ ఎలా మొదలు పెట్టాలన్న దానిపై ఆమె కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ మేరకు బుధవారం మీడియా ముఖంగా తన వైఖరిని, భవిష్యత్తు నిర్ణయాలను కవిత వెల్లడిస్తారని జాగృతి కార్యాలయం పేర్కొంది.
అయితే నిన్నటి వరకు పార్టీలోనే కొనసాగుతూ నిరసన గళం వినిపించిన కవిత.. సస్పెన్షన్ తర్వాత ఏం మాట్లాడతారన్నది ఉత్కంఠగా మారింది. ఆమె ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? రాజకీయ వ్యూహం ఏమిటి? అనేదానిపై చర్చ కొనసాగుతోంది. కవిత కేసీఆర్ కూతురే అయినప్పటికీ.. తన నాయకత్వ పటిమతో బీఆర్‌ఎ్‌సలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టే దిశగా ఆలోచిస్తుండడంతో రాజకీయంగా ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.