Share News

MLC Kavitha: బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:18 AM

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు రాకుండా కేంద్రంలోని బీజేపీ అడ్డుపడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు..

MLC Kavitha: బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి

  • బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న కేంద్రం

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

  • కామారెడ్డిలో రైల్వే ట్రాక్‌పై ఆందోళన

  • కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు

కామారెడ్డి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు రాకుండా కేంద్రంలోని బీజేపీ అడ్డుపడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్‌పై కవిత ఆందోళన చేపట్టారు. సుమారు అరగంటపాటు రైల్వే ట్రాక్‌పైనే నిరసన తెలిపారు. దీంతో ఆ సమయంలో ఆ ట్రాక్‌ గుండా వెళ్లాల్సిన దేవగిరి ఎక్స్‌ప్రె్‌సతోపాటు మరో గూడ్స్‌ రైలును రైల్వే అధికారులు నిలిపివేశారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరినా వినకపోవడంతో.. కవితతోపాటు నిరసనకారులను అరెస్ట్‌ చేసి దేవునిపల్లి పీఎస్‌కు తరలించారు. కవితను హైదారాబాద్‌కు తీసుకెళ్లారు. రైల్వేట్రాక్‌పై ఆందోళన చేయడం, రైలు నిలిచిపోవడానికి కారణమైన కవితపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లనకు అడ్డుపడుతున్న బీజేపీకి ఢిల్లీ వరకు మెసేజ్‌ పంపించేందుకే రైలురోకో చేపట్టామన్నారు. కేంద్రం దిగొచ్చేదాకా ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. తమ పోరాటం వల్లే బీసీ రిజర్వేషన్లకు బిల్లులు తెచ్చారని, అవి కూడా రాష్ట్రపతి వద్ద ఆగిపోయాయన్నారు. ఆ తర్వాత రైల్‌రోకో చేస్తామని హెచ్చరిస్తే ఆర్డినెన్స్‌ తెచ్చారని, అది కూడా గవర్నర్‌ వద్దే ఆగిపోయిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీజేపీ, కాంగ్రె్‌సతో కొట్లాడుతూనే ఉంటామన్నారు.

రేవంత్‌రెడ్డి బీసీ ద్రోహి..

సీఎం రేవంత్‌రెడ్డిని బీసీ ద్రోహిగా తాము ఇప్పటికే ప్రకటించామని కవిత తెలిపారు. ఆయన ఇప్పటివరకూ ప్రధాని మోదీకి ఈ అంశంపై ఒక్క లేఖ కూడా రాయలేదని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని విమర్శించారు. ఇంత తొందరగా పంచాయతీ ఎన్నికల అవసరమేముందని ప్రశ్నించారు. తమిళనాడులో నాటి సీఎం జయలలిత 9 ఏళ్లు ఎన్నికలను ఆపి రిజర్వేషన్లు సాధించారని గుర్తుచేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి, నిజామాబాద్‌లో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. ఒక్క సీజన్‌లో మాత్రమే హల్ది వాగు ద్వారా నీళ్లు ఇచ్చారన్నారు.

కుటుంబం నుంచి దూరం చేశారు

తనను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో భాగంగానే బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయించారని విలేకరుల సమావేశంలో కవిత ఆరోపించారు. అందుకు బాధగా ఉందన్నారు. సస్పెండ్‌ చేయించినవారు శునకానందం పొందవచ్చునని, కానీ మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం తాను పనిచేస్తూనే ఉంటానని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన పిల్లల కన్నా తన తల్లి ఆరోగ్యం గురించే ఎక్కువ బాధపడ్డానని తెలిపారు.

Updated Date - Nov 29 , 2025 | 04:18 AM