Jagruti President Kalvakuntla Kavitha: సీఎం.. వీధి రౌడీ భాష మార్చుకో!
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:41 AM
సీఎం వీధి రౌడీ భాషను మార్చుకోవాలని, కాలేజీ యాజమాన్యాల తాట, తోలు తీస్తానని మాట్లాడటం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు....
మీరు మాట తప్పి కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తారా?: కవిత
వరంగల్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీఎం వీధి రౌడీ భాషను మార్చుకోవాలని, కాలేజీ యాజమాన్యాల తాట, తోలు తీస్తానని మాట్లాడటం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా సీఎం మాట్లాడారని దుయ్యబట్టారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో చేపట్టిన ‘జాగృతి జనంబాట’లో కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం కాలేజీలను తెలంగాణలో పెట్టకపోతే.. లోన్లు తీసుకుని పైసా పైసా పెట్టి ఇక్కడ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ విద్యార్థులకు విద్యను అందించినందుకు వారి తాట తీస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1,800 కాలేజీలుంటే.. రెండు కాలేజీల పేర్లే సీఎం చెప్పారని, ఆ రెండు కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అనుమతులు ఇవ్వొద్దన్నారు. కానీ, మిగతా కాలేజీలు ఏం తప్పు చేశాయని ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పి వారినెలా బెదిరిస్తారంటూ సీఎంను ప్రశ్నించారు. తన మాటే జీవోతో సమానమన్న రేవంత్.. వరంగల్ వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చి 15 రోజులైనా ఇప్పటికీ నయా పైసా నిధులు ఇవ్వలేదన్నారు.