Kavitha criticized both BRS and Congress: జాగృతికి బీఆర్‌ఎస్ దుష్మన్
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:46 AM
తెలంగాణ జాగృతికి బీఆర్‌ఎస్ కూడా శత్రువే (దుష్మన్)నని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కాంగ్రె్‌సతోపాటు బీఆర్‌ఎస్ నేతలు కూడా జాగృతిని విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.....
జాగృతిని విమర్శించడాన్ని ఆ పార్టీ నేతల పని.. ప్రజాసమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం జాగృతి బాధ్యత
నిర్వాసితుల సమస్య పరిష్కరించకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా
నల్లగొండ పర్యటనలో జాగృతి అధ్యక్షురాలు కవిత
నల్లగొండ, నవంబరు12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ జాగృతికి బీఆర్‌ఎస్ కూడా శత్రువే (దుష్మన్)నని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కాంగ్రె్‌సతోపాటు బీఆర్‌ఎస్ నేతలు కూడా జాగృతిని విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘జాగృతి- జనం బాట’ కార్యక్రమంలో భాగంగా కవిత బుధవారం నల్లగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలో బీఆర్‌ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ప్రజాసమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెచ్చే బాధ్యతను జాగృతి తీసుకుందని చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, బీఆర్‌ఎస్ తప్పులు చేయడం వల్లే ప్రజలు ఆ పార్టీని అధికారం నుంచి తప్పించారని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పని చేయకపోతే ప్రజలు వేరే వారికి అధికారమిస్తారని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలన కలిపి మొత్తం పన్నెండేళ్లలో కృష్ణా జలాలు తెలంగాణకు ఎందుకు తేలేకపోయారో మేధావులు ఆలోచించాలని కోరారు. దేవరకొండ ఎస్సీ గురుకుల పాఠశాల భూములు, భూదాన్ భూముల కబ్జాలపై పదేపదే మాట్లాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. జూబ్లీహి ల్స్ ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీలేదని అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాలు తేవడంలో అలసత్వం ప్రదర్శించినా, భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోయినా నిర్వాసితులతో కలిసి సీఎం ఇంటి ముందు ఽధర్నా చేస్తామని హెచ్చరించారు. అలాగే, నాగార్జున సాగర్ ఎడమ కాల్వను రాష్ట్ర అధీనంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, డిండి ఎత్తిపోతల పథకాలు ఎప్పటికీ పూర్తవుతాయో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి చెప్పాలని నిలదీశారు. డిండి, నక్కలగండి, నెల్లికల్లు ప్రాజెక్టులు, యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఽధాన్యం కొనుగోళ్లలో అధికారుల అలసత్వం వల్ల రైతులు నష్టపోతున్నారని, పత్తి రైతుల పరిస్థితీ దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవరకొండ వద్ద కొమ్మేపల్లి గురుకుల పాఠశాలలోని సమస్యలపై మంత్రులు, జిల్లా అధికారులు దృష్టి సారించాలని కోరారు. కాగా, ప్రసవానికి వచ్చే మహిళలకు నొప్పుల బాధ నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇచ్చే ఎపిడ్యూరల్ ఇంజక్షన్లను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్‌ఎస్ హయాంలో తాను ఈ సదుపాయం కల్పించలేకపోయినందుకు మహిళలకు క్షమాపణలు చెప్పారు.
మంత్రి కోమటిరెడ్డితో పంచాయితీ లేదు
కవిత పర్యటన నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు అనుమతి తీసుకోకుండా నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మునిసిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో ధర్నాకు దిగిన జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కవిత మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డితో తమకు పంచాయితీ లేదని, జాగృతి నాయకులతో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదన్నారు. తమ కార్యకర్తలను విడుదల చేయాలని కోరారు. కవిత పర్యటన తర్వాత జాగృతి కార్యకర్తలను పోలీసులు వదిలిపెట్టారు.
కవిత బీఆర్‌ఎస్ నేతలనే ప్రశ్నించాలి : మంత్రి కోమటిరెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల తాత్సారానికి రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్సే కారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆయా అభివృద్ధి పనులపై కవిత ప్రశ్నించాలని అనుకుంటే ముందుగా బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించాలని ఆయన సూచించారు. నల్లగొండ పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ మేరకు స్పందించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు ప్రమాదం వల్ల కొన్ని నెలలు మాత్రమే ఆగాయని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చేసేందుకు సర్వే నిర్వహిస్తున్న విషయాన్ని కవిత తెలుసుకోవాలన్నారు. నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో తన సొంత నిధులతో పలు సదుపాయాలు కల్పించానని, చేసింది చెప్పుకోవడం తన నైజం కాదన్నారు. ఇక, కవిత పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు, వాటి తొలగింపు అంశాలు తనకు తెలియదన్నారు. జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకొని ఉంటే వదిలేయమని పోలీసులు చెప్పానని వెల్లడించారు.