Political Strategy: కేసీఆర్ ఫొటో లేకుండా కవిత యాత్ర
ABN , Publish Date - Oct 15 , 2025 | 03:42 AM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి దూరమైనప్పటికీ ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేపట్టినా పోస్టర్లు...
జాగృతి పోస్టర్లలో ఇక నుంచి ప్రొఫెసర్ జయశంకర్ ఫొటో
ఒక్కో జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటన
అన్ని వర్గాలతో చర్చలు, అభిప్రాయ సేకరణ
రాజకీయ ముందడుగుపై సమాలోచనలు
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి దూరమైనప్పటికీ ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేపట్టినా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫొటో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న కవిత... ఇకమీదట కేసీఆర్ ఫొటో లేకుండానే రాజకీయంగా ముందుకు సాగాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇకపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో వాడకూడదని జాగృతి శ్రేణులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేసీఆర్ ఫోటోకు బదులుగా తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు డిజైన్ చేయాలని సూచించినట్లు తెలిసింది. కవిత ఈ నెలాఖరులో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావాలని, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోవటానికి క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని భావిస్తున్నారు. ఈ యాత్ర సాదాసీదాగా కాకుండా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించాలని, కనీసం రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని కవిత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాకపోతే నిరాటంకంగా కాకుండా ఒకటి, రెండు జిల్లాల్లో యాత్ర చేయటం, ఆ తర్వాత కాస్త విరామం తీసుకోవటం, మళ్లీ వేరే జిల్లాలకు వెళ్లడం... అనే పద్ధతిలో రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అక్టోబరు చివరి వారంలో (దీపావళి ముగిసిన తర్వాత) జిల్లాల యాత్ర చేపట్టనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. జిల్లాల పర్యటనలో కవిత వివిధ వర్గాలతో సమాలోచనలు జరపనున్నారు. బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ కావటం, పార్టీతో దాదాపుగా తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి? రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలి? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో చర్చించనున్నారు. భవిష్యత్తు నిర్ణయాలకు ఈ యాత్రను ఒక వేదికగా తీసుకోనున్నారు.