Kalvakuntla Kavitha: చర్చల తర్వాతే పార్టీ
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:35 AM
టీఆర్‌ఎస్ స్థాపించే ముందు వందల మందితో కేసీఆర్ చర్చలు జరిపారని, ప్రస్తుతం తానూ అదే చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
తండ్రి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మొదటి కూతురిని నేనే కావొచ్చు
కాంగ్రెస్‌లో చేరే ఆలోచన లేదు
రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకుంటే సీఎం, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం
ల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడాల్సిందే: కవిత
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్ స్థాపించే ముందు వందల మందితో కేసీఆర్ చర్చలు జరిపారని, ప్రస్తుతం తానూ అదే చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. కార్యకర్తలు, నాయకులతో చర్చించిన తర్వాతే పార్టీ ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. నిత్యం వందలాది మది వచ్చి తనను కలుస్తున్నారని, తనతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేతల జాబితా చాలా పెద్దదని చెప్పారు. చరిత్రలో తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని బహుశా తానే అయి ఉండొచ్చని అన్నారు. ఈ మేరకు శనివారం జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా, హరీశ్ రావు, సంతోష్ రావు సీక్రెట్ మీడియా తనపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయని ధ్వజమెత్తారు. అందరూ తననే లక్ష్యంగా చేసుకుంటున్న విషయాన్ని జనం కూడా పరిశీలిస్తున్నారని చెప్పారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లు నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రి సంతకాలు పెట్టకుండా, నేరుగా పెద్ద సారు ద గ్గరికే వెళ్తున్నాయని, ఇది తర్వాతి కాలంలో ఇబ్బందులకు దారీ తీయొచ్చని 2016లోనే కేటీఆర్‌ను హెచ్చరించా. నేను అన్నట్లే ప్రాజెక్టు విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్‌దేనని హరీశ్‌రావు పీసీ ఘోష్ కమిషన్‌కు చెప్పారు’’ అని కవిత పేర్కొన్నారు. కాంగ్రె్‌సలో చేరే ఆలోచన తనకు లేదని, ఆ పార్టీ పెద్దలు కూడా ఎవరూ తనను సంప్రదించలేదని వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే తన పేరు ఎందుకు తీస్తున్నారో తెలియదని, ఒక వేళ ఆయనే కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్తున్నారేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పదవికి సంబంధిత ఫార్మాట్‌లోనే రాజీనామా చేశానని, ఆమోదించకుండా మండలి చైర్మన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియదని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న పార్టీ ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, ఎంత మంది జై బీసీ అంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. 42శాతం బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకుంటే సీఎం, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, అదే జరిగితే.. కృష్ణా నదిలో తెలంగాణ వాళ్లు క్రికెట్ ఆడుకోవాల్సిందేని అన్నారు. చింతమడకలో బతుకమ్మ వేడుకలకు వెళ్లడం వెనుక రాజకీయమేమి లేదన్నారు. పండుగ వేళ ఇచ్చే చీరలను ఇందిరమ్మ పేరుతో కాకుండా బతుకమ్మ పేరుతో ఇవ్వాలని సూచించారు.