Share News

Kavitha: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు అన్యాయం నిజమే

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:43 AM

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగింది కనుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించారన్నది నిజమేనని, అందులో మరొక అభిప్రాయం లేదని...

Kavitha: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు అన్యాయం నిజమే

  • అందుకే ఆ పార్టీని ఓడించారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.. గ్రూప్‌-1 అభ్యర్థులతో మాట-ముచ్చట

  • అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సమావేశం

  • కేసీఆర్‌ పాలనలో పేపర్‌ లీకేజీలపై కవితను నిలదీసిన నిరుద్యోగులు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగింది కనుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించారన్నది నిజమేనని, అందులో మరొక అభిప్రాయం లేదని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలపై సమాధానం చెప్పాలంటూ నిరుద్యోగులు నిలదీయడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వారిని ఉద్దేశించి ‘మీరు అధికార పక్షం మాయలో పడకూడద’ని కవిత అనగానే, ‘తప్పు..తప్పు... మేమెవ్వరికీ చుట్టాలం కాద’ంటూ నిరుద్యోగులు మూకుమ్మడిగా నినదించారు. కవిత మాట్లాడుతూ ‘గ్రూప్‌-1 పోస్టుల్లో నిబంధనలు తుంగలో తొక్కి నాన్‌ లోకల్‌ కింద 8మంది ఆంధ్రావాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. మనం తెలంగాణ కోసం పోరాడింది ఆంధ్రావాళ్లకు ఉద్యోగాలివ్వమని కాదు. గత ప్రభుత్వంలో నేనూ భాగస్వామిగా ఉన్నాను. మా వల్ల తప్పు జరిగి ఉండచ్చు. అయితే, మనలో మనం తెలంగాణ వాళ్లం తప్పు సరిదిద్దుకోవాలి. అంతేకానీ ఆంధ్రావాళ్ల కోసం తలవంచిన ప్రభుత్వాల పక్షాన నిలవకూడదు. విద్యార్థులకు అన్యాయం చేసినందుకే ఇదివరకు ప్రభుత్వాలు మారాయి. కనుక అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వం కూడా నిలబడద’ని అన్నారు. మంగళవారం చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీలో తెలంగాణ జాగృతి తలపెట్టిన గ్రూప్‌-1 అభ్యర్థులతో మాట-ముచ్చట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరిగింది. లైబ్రరీ లోపలికి రానివ్వకుండా గేటు బయటే కవితను పోలీసులు అడ్డుకోగా, జాగృతి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చివరికి బలవంతంగా తలుపులు తోసుకుని వారంతా లోపలకి వచ్చారు. కానీ సభా మందిరంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో లైబ్రరీ పార్కింగ్‌ ప్రదేశంలో కవిత బైఠాయించారు. అక్కడే నిరుద్యోగులతో సంభాషించారు. గ్రూప్‌-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని, ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. అందుకే అభ్యర్థుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కోర్టులను ఆశ్రయిస్తోందని కవిత విమర్శించారు. లక్షల రూపాయల ఫీజు తీసుకునే లాయర్లను పేద విద్యార్థుల మీద ప్రయోగిండం న్యాయమేనా అని నిలదీశారు. ఈ నెల 15న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నుంచి కేసు విచారణలో విద్యార్థులకు అనుకూలంగా తీర్పు రాకుంటే, బాధితుల పక్షాన తాను సుప్రీంకోర్టుకు వెళతానన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బాధితులతో కలసి బిహార్‌లోనూ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


నిరుద్యోగుల ఆగ్రహం

కవితతో మాట-ముచ్చటలో భాగంగా కొంతమంది నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ‘ఉద్యోగం రాక మనస్తాపంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే, అసలు ఆమె అభ్యర్థే కాదని మీ అన్న అన్నాడు. కేసీఆర్‌ హయాం లో జరిగిన పేపర్‌ లీకేజీల మీదా సమాధానం చెప్పాలం’టూ గడుసు కృష్ణ అనే నిరుద్యోగి కవితను నిలదీశాడు. ఈ కార్యక్రమం సందర్భంగా కొందరు అభ్యర్థులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో చిక్కడపల్లి సీఐ రాజు నాయక్‌ అసహనానికి గురై.. విద్యార్థులు, దారినపోయే వారితో దురుసుగా వ్యవహరించారు.

Updated Date - Oct 15 , 2025 | 03:43 AM