Kavitha criticized: ఉద్యమ కారుల పట్ల కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:51 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వంపై ఆయన కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు గుప్పించారు...
త్యాగధనులను గౌరవించని గత మంత్రులు, ఎమ్మెల్యేలు
ఉద్యమ కారులకిచ్చిన హామీలపై ముందడుగు వేయని రేవంత్ సర్కారు
ఇంటిస్థలం, పింఛన్‌లపై 9న ప్రకటన చేయాలి: కవిత
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వంపై ఆయన కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు గుప్పించారు. ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కారులను నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర సాధనకు త్యాగాలు చేసిన వారిని గౌరవించక పోవడం అందరినీ బాధించిందన్నారు. సొంత రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని తామే చెప్పినా.. 540 కుటుంబాలకు మాత్రమే సాయం చేశామని కవిత పేర్కొన్నారు. తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ జాగృతి కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమర వీరుల బలి దానాలు, విద్యార్థుల త్యాగాలు, కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. వారికి కనీస గౌరవం ఇవ్వలేదని కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను సరి చేస్తామని, ఉద్యమ కారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు 250 గజాల ఇంటి స్థలం, పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ హామీ అమలు దిశగా ముందడుగు వేయలేదని కవిత పేర్కొన్నారు. ఉద్యమ కారులకు ఇచ్చిన హామీల అమలుపై ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసి, వారికి పింఛన్లతోపాటు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఉద్యమ కారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఒకవేళ 9న సీఎం ప్రకటన చేయకుంటే.. జాగృతి భూపోరాటాలు ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల వద్దకు ఉద్యమకారులను తీసుకెళ్లి, జాగృతి జెండాలు పాతి వారికి ఆ భూములు పంపిణీ చేస్తామని హెచ్చరించారు.