Share News

Kavitha: కాళేశ్వరంపై చూపిన శ్రద్ధను పాలమూరుపై చూపలేదు

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:09 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kavitha: కాళేశ్వరంపై చూపిన శ్రద్ధను పాలమూరుపై చూపలేదు

  • పదేళ్లలో పరుగులు పెట్టించలేదు

  • అందుకే కృష్ణా జలాల్లో 90 టీఎంసీలపై హక్కు పొందలేకపోయాం

  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యం వల్లే!

  • హరీశ్‌ వల్ల ‘కల్వకుర్తి’లో 3 మోటార్లే పనిచేస్తున్నాయి

  • డైవర్షన్‌, కరప్షన్‌లో రేవంత్‌రెడ్డి దిట్ట: కవిత

నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చూపలేదని, కాళేశ్వరం తరహాలో ఈ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించలేదని ఆరోపించారు. ఈ కారణంగానే కృష్ణా జలాల్లో 90 టీఎంసీల నీటి వాటాపై హక్కును పొందలేకపోయామన్నారు. నిర్దేశించిన కాలంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి ఉంటే కచ్చితంగా తెలంగాణకు 90 టీఎంసీల నీటి వాటా దక్కేదని తెలిపారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు జిల్లాకు కృష్ణా జలాల వినియోగంలో జరిగిన అన్యాయం.. కాంగ్రెస్‌ పాలనలోనూ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ హయాంలో లెక్కలేనంత అవినీతి జరిగిందని ఆరోపించారు. నాటి మంత్రి హరీశ్‌రావు నిర్వాకంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికీ మూడే మోటార్లు పని చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత శనివారం నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో పర్యటించారు. వట్టెం రిజర్వాయర్‌ను పరిశీలించి.. రిజర్వాయర్‌ సామర్థ్యం, నిర్వాసితులకు అందిన పరిహారంపై ఆరా తీశారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఎల్లూరులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరద జలాల ఆధారంగా నల్లమల సాగర్‌ను నిర్మిస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న ప్రయత్నాలతో తెలంగాణ ప్రాజెక్టులకు మున్ముందు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో డైవర్షన్‌ల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి కరప్షన్‌కు తెరలేపుతున్నారని ఆరోపించారు. కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పూర్తయ్యే పథకానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లలో ఈ పథకంలో రెండు తట్టల మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు.

Updated Date - Dec 28 , 2025 | 06:11 AM