Share News

Kavitha Blasts BRS Leaders: ఉద్యమ సమయంలో దోపిడీ

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:56 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో, పదేళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు, దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వారు ఎవరెవరి దగ్గర దోచుకున్నారో.....

Kavitha Blasts BRS Leaders: ఉద్యమ సమయంలో దోపిడీ

  • స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూళ్లు

  • బయటపెడితే తెలంగాణ సిగ్గు పోతుందని ఊరుకున్నా

  • టాస్‌ మాత్రమే వేశాను.. టెస్టు మ్యాచ్‌ ముందే ఉంది

  • నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు

  • ఇంటి అల్లుడి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడానికి సిగ్గుండాలి

  • హరీశ్‌రావు మాటలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నోటి వెంట

  • టీన్యూ్‌సకు, ఏలేటికి, కృష్ణారావుకు లీగల్‌ నోటీసులు

  • ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు ఇస్తూ కేటీఆర్‌ సంతకం

  • ఆ లావాదేవీలతో రేవంత్‌కూ లింకు.. అందుకే సైలెంట్‌

  • ఏదో రోజు సీఎంనవుతా.. మీ పని పడతా: కవిత

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో, పదేళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు, దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వారు ఎవరెవరి దగ్గర దోచుకున్నారో ఆ వసూళ్ల చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఏయే స్టూడియోల ముందు ధర్నాలు చేసి.. వసూళ్లకు పాల్పడి కాంప్రమైజ్‌ అయ్యారో తనకు తెలుసునని, ఈ విషయాలన్నీ బయటపెడితే తెలంగాణ వాళ్ల సిగ్గుపోతుందనే ఉద్దేశంతో ఇంతకాలం ఊరుకున్నానని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు, పిచ్చి ప్రచారాలు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. తానింకా వారి పాపాల చిట్టా విప్పడం ప్రారంభించలేదని, టాస్‌ మాత్రమే వేశానని, అసలైన టెస్ట్‌ మ్యాచ్‌ మందే ఉందని అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. వారిలా వసూళ్లు చేసుకొని ఉద్యమాలు నడపలేదని, తన నగలు కుదువ పెట్టి బతుకమ్మ సంబురాలు చేశానని తెలిపారు. అందుకే తనకు ఇంత పౌరుషమని చెప్పారు. ‘‘అమెరికా నుంచి 2004లో ఇక్కడికి వచ్చాక.. నేను ఉద్యమంలో, నా భర్త అనిల్‌కుమార్‌ వ్యాపారంలో ఉన్నాం. మీలాగా మంది మీద పడి దోచుకోలేదు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ప్రజల ద్వారా బయటపడ్డ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల అక్రమాలు, ఆక్రమణలు, దాష్టీకాలను ప్రశ్నిస్తుంటే.. నాపై దుష్ప్రచారాలతో దాడికి దిగుతున్నారు’’ అని కవిత మండిపడ్డారు.


టీన్యూస్‌ చానల్‌కు లీగల్‌ నోటీస్‌..

కొందరు నాయకుల అక్రమాల చిట్టాను తాను బయటపెడుతున్నందుకే వారు తన భర్తపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కవిత తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రెస్‌మీట్‌లో చేసిన నిరాధార ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకోకుండా ప్రసారం చేసిన టీన్యూస్‌ చానల్‌కు లీగల్‌ నోటీస్‌ పంపుతున్నానని చెప్పారు. వారంలోగా తమకు క్షమాపణ చెప్పకపోతే ఆ చానల్‌ను కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. దాంతోపాటు తమ పరపతిని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి, మాధవరం కృష్ణారావుకు కూడా లీగల్‌ నోటీస్‌ ఇస్తున్నానని ప్రకటించారు. కృష్ణారావు ఆరోపిస్తున్న 2010/2, 2010/3 సర్వే నంబర్లలోని భూమికి 1975 నుంచే పట్టాలు, పాస్‌బుక్‌ ఉన్నాయని, అది పూర్తిగా ప్రైవేటు భూమి అని కవిత చెప్పారు. నలుగురు కొడుకులకు కలిపి 16 ఎకరాల భూమి ఉందని, ఒకప్పుడు టెకం షా అనే కంపెనీకి ప్రభుత్వం 37 ఎకరాలు అమ్మగా, ఆ కంపెనీ ప్రైవేటు వాళ్ల భూమిని కబ్జా చేసి.. కాంపౌండ్‌ వాల్‌ కట్టుకుందని తెలిపారు. ఈ భూమిపై 9 ఏళ్లు వివాదం కొనసాగగా, 2019లో లోక్‌ అదాలత్‌లో 16 ఎకరాల భూమి వాటాదారులతో కంపెనీ కాంప్రమైజ్‌ అయిందని పేర్కొన్నారు. పట్టాదారుల తరఫున ఉండి కొట్లాడిన తన భర్త, వారి వ్యాపార భాగస్వాములు 2019లో ఆ భూమిని అమ్మేసి బయటకు వచ్చారని వివరించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎక్కడా తన భర్త పేరు బయటకు రాలేదని, ఇప్పుడు ఆయనపై లేనిపోనివి అంటగట్టి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఇంటి అల్లుడి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడానికి సిగ్గుండాలె. వెధవ ప్రచారాలు చేస్తున్నరు. కళ్లు చల్లబడతలేవా మీకు? పార్టీ నుంచి బయటికి వెళ్లగొట్టారు కదా.. ఇంకేంది?’’ అని కవిత ధ్వజమెత్తారు.

కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలి..

మాధవరం కృష్ణారావు ఆరోపిస్తున్న ఇండస్ట్రియల్‌ భూమిలోనే 12 ఎకరాలు నిర్మాణం కోసం 2022లో నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ సంతకం చేసి అనుమతించారని కవిత తెలిపారు. అది ప్రభుత్వ భూమి అయితే ఎలా అనుమతి వచ్చిందో చెప్పాలన్నారు. ఆ భూమికి దగ్గరలో ఉన్న ఇండస్ర్టియల్‌ భూమిలో 5 ఎకరాలకు చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ కింద 2023 అక్టోబరు 7న ఎన్నికలకు వెళ్లే ముందు అనుమతి ఎందుకిచ్చారో కేటీఆర్‌, కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ పార్టీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యాపారం చేసే వ్యక్తి కృష్ణారావు చుట్టమేనన్నారు. ఇటీవల అక్కడే మరో 6 ఎకరాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ కింద అనుమతి ఇచ్చిందని తెలిపారు. కృష్ణారావు బాధితులు ఎంతో మంది రెండు రోజులుగా తనకు ఫోన్లు చేస్తున్నారని కవిత తెలిపారు. 16 ఎకరాలు, 400 ఎకరాలు, సీఎస్‌ 14 ల్యాండ్స్‌లో ఆయన అక్రమాలు మామూలుగా లేవన్నారు. కృష్ణారావు కొడుకు ఎండీగా ఉండే ప్రణవ్‌ ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వెంచర్‌ మొత్తం 70 ఎకరాలు ఉందని, అక్కడ ప్రభుత్వ రోడ్డును, మధ్యలో చెరువు, అసైన్డ్‌ భూములను కూడా కబ్జా చేశారని ఆరోపించారు. రెరాకు ఇచ్చిన సమాచారం ప్రకారం చెరువు 10 ఎకరాలుంటే, నాలుగేళ్లకు 6 ఎకరాలంటూ ఇరిగేషన్‌ శాఖ ద్వారా ప్రకటించారని తెలిపారు. మధ్యలో నాలుగెకరాలను ఎవరు మింగారని ప్రశ్నించారు.


కేపీ వివేకానంద, కృష్ణారావు కబ్జా..

గాజుల రామారంలో భూమిని కబ్జా చేసింది తాను కాదని, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కృష్ణారావు అని కవిత అన్నారు. కేటీఆర్‌ హయాంలో బోలెడన్ని చెరువులను బ్యూటిఫికేషన్‌ పేరుతో ప్రైవేటు బిల్డర్లకు ఇచ్చారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు సపోర్ట్‌ చేసిన వ్యాపారవేత్తలను యథాతథంగా కాంగ్రెస్‌ వాళ్లు కూడా సపోర్ట్‌ చేస్తున్నారని కవిత ఆరోపించారు. ‘‘ఏవీ రెడ్డికి చెందిన వెంచర్స్‌లో భాగస్వామి అయిన పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి ఎవరికి బినామీ? పొద్దున లేస్తే రామన్నతో ఉంటడు. సంబందాలు మీకున్నాయా? నాకున్నాయా?’’ అని ప్రశ్నించారు. పార్టీలో జరిగిన వ్యవహారాలన్నీ కేసీఆర్‌కు తెలిసే ఉంటాయని, దీనిపై ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ పార్టీ తనపై చేయాలనుకున్న విషప్రచారం.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నోటి నుంచి, బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ద్వారా వస్తోందని తెలిపారు. కృష్ణారావు చిన్నవాడని, అయన వెనకున్న గుంటనక్క బండారం బయటపెడతానని హెచ్చరించారు.

ఎప్పుడైనా ఏ పని అయినా అడిగామా?

‘‘నేను, నా భర్త బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుతోగానీ, ఏ మంత్రితోగానీ ఏదైనా పని చేసిపెట్టమన్నామా? ’’ అని కవిత ప్రశ్నించారు. తనలో నీతి, నిజాయితీ ఉంది కాబట్టే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లి మాట్లాడుతున్నానని, తనకు ఎవరితోనూ అండర్‌స్టాండింగ్‌, వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. సెయింట్‌ గోబెన్స్‌ కంపెనీకి 70 ఎకరాలను గుంటనక్క రికమండ్‌ చేస్తే.. వాసవి బిల్డర్స్‌ వారికి ఇచ్చారు. ఆ అధికారి పేరు, గుంటనక్క పేర్లు కలిపి విజిలెన్స్‌, సీబీఐ, ఈడీకి పూర్తి సమాచారంతో ఫిర్యాదుచేస్తా’’ అన్నారు.


రేవంత్‌కూ సంబంధం.. అందుకే సైలెంట్‌..

కాంగ్రెస్‌ ప్రభుత్వం హిల్ట్‌ పాలసీ తెచ్చి భూములను ధారాదత్తం చేస్తోందని కవిత ఆరోపించారు. ‘‘దీనికి బీజం వేసింది ఎవరు? డిస్టిలరీ భూములను ప్రైవేటుకు ఇవ్వలేదా? పలు సంస్థలను ఎంపిక చేసుకొని చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ పేరిట ప్రభుత్వ భూములను మీరు ప్రైవేటుకు ధారాదత్తం చేయలేదా? దాని మీద సంతకం పెట్టింది కేటీఆర్‌ కాదా?’’ అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ కిటికీలు తెరిస్తే.. కాంగ్రెస్‌ వాళ్లు ఏకంగా దర్వాజాలు తెరిచి దోచుకు తినమంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతి జరిగిందని, వారిని తెల్లారేకల్లా జైల్లోపెడతానంటూ ప్రజల్లో వ్యతిరేకతను చిత్రీకరించిన రేవంత్‌రెడ్డి పరిస్థితి అప్పుడే కప్పను తిన్న పాములా మారిందని విమర్శించారు. ‘‘ సీఎం అయ్యాను.. కడుపు నిండింది. అవినీతి జరిగితే నాకేం? రాష్ట్రం ఎటుబోతే నాకేంది? అన్నట్లుగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ వ్యాపార లావాదేవీలతో రేవంత్‌కూ సంబంధం ఏర్పడినందునే సైలెంటయ్యారు’’ అని ఆరోపించారు. ఎప్పుడో ఒకసారి తాను కూడా సీఎం అవుతానని, ఆనాడు 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్యాయాలు, అక్రమాలపై ఆరా తీస్తానని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు.

Updated Date - Dec 13 , 2025 | 05:56 AM