Telangana Jagruthi president Kavita: కర్మ హిట్స్ బ్యాక్!
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:49 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన ఎక్స్‌లో చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ...
తప్పుచేసేవారు ఎవరైనా గట్టిగా చెబుతా
అందుకే పార్టీ నుంచి బయటకు పంపారు
జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలిచినా ఒరిగేదేం లేదు
మెదక్ జిల్లా నర్సాపూర్, రెడ్డిపల్లి పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్/మెదక్/నర్సాపూర్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన ఎక్స్‌లో చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. శుక్రవారం సాయంత్రం ఆమె ‘కర్మ హిట్స్ బ్యాక్.. (కర్మ ఎవరినీ వదలిపెట్టదు)’ అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారంటూ.. రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చ కొనసాగుతోంది. బీఆర్‌ఎ్‌సలో అంతర్గతంగా ఇబ్బందులున్నాయని చెబుతూనే.. పలువురు ముఖ్య నేతలపై విమర్శలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్‌ఎ్‌సకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. కవిత వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ఆంగ్లంలో కేవలం ఒకేలైన్‌లో కవిత చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. కాగా.. తప్పు చేసే వారు ఎవరైనా, ఎంతటి వారైనా తాను గట్టిగా వారి పేరు చెప్పడం అలవాటని, అందుకే తనను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు పంపారని కవిత చెప్పారు. జాగృతి ఆధ్వర్యంలో జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లాలో పర్యటించారు. రెడ్డిపల్లిలో కాలేశ్వరం, ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులతో సమావేశమై వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మారినా, రైతుల పరిస్థితులు మాత్రం మారడం లేదన్నారు. మార్కెట్ ధరకు అనుగుణంగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా చిన్నదని, అందులో ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఘనపురం ఆనకట్ట ఎత్తు శిలాఫలకానికే పరిమితమైందని కవిత విమర్శించారు. ఈ ఆనకట్ట ఎత్తు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.