Telangana Jagriti president Kavita: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం!
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:37 AM
రాష్ట్రంలో 2029లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలిపారు.....
సామాజిక తెలంగాణే ధ్యేయం.. త్వరలోనే రాజకీయ పార్టీ.. దానికి ప్రజలు సూచించిన పేరే పెడతాం
యువత, మహిళలకు అవకాశాలిస్తాం
రేవంత్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి
‘ఆస్క్ కవిత’ కార్యక్రమంలో నెటిజన్లతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2029లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలిపారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వెల్లడించారు. తాను పెట్టబోయే పార్టీకి ప్రజలు సూచించిన పేరునే ఖరారు చేస్తానన్నారు. తన రాజకీయ వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ పాలన తీరు, తదితర అంశాలపై ‘ఆస్క్ కవిత’ పేరుతో సోమవారం ఆమె ఎక్స్ వేదికగా నెటిజన్లతో సంభాషించారు. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని కవిత ఆకాంక్షించారు. అదే సమయంలో వారికి రాజకీయ అవకాశాలు కూడా దక్కాలని, అలా కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందని తెలిపారు. కొత్త పార్టీకి సంబంధించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని కవిత చెప్పారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడతామని, తెలంగాణ సాధికారిత సాధ్యం కావాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని పేర్కొన్నారు. తెలంగాణలో తల్లితండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకూడదన్నారు. ఉద్యోగాలు, నైపుణ్యం, భద్రతలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా.. యువతకు ఉద్యోగాలు కల్పించడమే తన తొలి ప్రాధాన్యమని బదులిచ్చారు. ఉద్యోగాలతోపాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందని చెప్పారు. క్రమంగా జాగృతిని బలంగా తయారు చేస్తామని, త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
రేవంత్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి
రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని కవిత చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరగడం బాధాకరమని అన్నారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేస్తున్నారని, తర్వలోనే అక్కడి రైతులకు మద్దతుగా ఉద్యమిస్తామని చెప్పారు. సింగరేణిని నిర్లక్ష్యం చేస్తున్న సర్కారుపై పోరాటం చేస్తామన్నారు. తాను చిరంజీవి అభిమానినని ఓ నెటిజన్ ప్రశ్నకు కవిత సమాధానం ఇచ్చారు. రామ్‌చరణ్ వినయంగా ఉండే వ్యక్తి, మంచి డ్యాన్సర్ అని, అయినప్పటికీ చిరంజీవి తర్వాతే రామ్‌చరణ్ అని చెప్పారు. చిన్నప్పుడు ఎర్రమంజిల్‌లో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషాన్ని ఇచ్చాయన్నారు. రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినె్‌సపై దృష్టి పెట్టాలని ఓ నెటిజన్ సూచించగా.. సోషల్ మీడియాలో ఇలాంటి నెగిటివిటీ ఉంటుందని, దాన్ని పట్టించుకోకుండా సరైన దృక్పథంతో ముందుకు వెళ్లడం మంచిదని కవిత అభిప్రాయపడ్డారు.
కవితపై తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాం
రేవంత్ మాటలనే కవిత మాట్లాడుతున్నారంటూ వి.ప్రకాశ్ అనే వ్యక్తి దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారం మానుకోకపోతే నాలుక చీరే స్తామని జాగృతి నాయకులు రూప్‌సింగ్, సయ్యద్ ఇస్మాయిల్ హెచ్చరించారు. నిరాధార ఆరోపణలతో కవితను బద్నామ్ చేయాలని చూస్తున్నారని.