Fake Certificate: నకిలీ సర్టిఫికెట్‌తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్!
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:05 AM
కర్నూలు సమీపంలోని చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన వేమూరి కావేరి బస్సును నడిపిన డ్రైవర్ మిర్యాల...
చదివింది ఐదో తరగతి.. 10 తప్పినట్టు పత్రాలు
ఆర్టీయేను మాయ చేసిన.. కావేరి డ్రైవర్ లక్ష్మయ్య
గతంలోనూ ప్రమాదం.. క్లీనర్ మృతికి కారణం
కారంపూడి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కర్నూలు సమీపంలోని చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన వేమూరి కావేరి బస్సును నడిపిన డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య ఆర్టీయే అధికారులను మాయ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య.. పదో తరగతి చదివినట్లు నకిలీ సర్టిఫికెట్ సృష్టించి దాని ఆధారంగా హెవీ లైసెన్సు పొందాడు. వాస్తవానికి హెవీ డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి కనీసం 8వ తరగతి వరకు చదివి ఉండాలి. కానీ, లక్ష్మయ్య 5వ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్ సృష్టించి హెవీ లైసెన్సు పొందినట్టు పోలీసులు తాజాగా గుర్తించారు. ఇక, లక్ష్మయ్య డ్రైవింగ్ కెరీర్ కూడా ఏమీ బాగోలేదని తెలుస్తోంది. 2004లో లారీ నడుపుతూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టాడు. నాటి ఘటనలో లారీ క్లీనర్ మృత్యువాత పడగా లక్ష్మయ్య తృటిలో తప్పించుకున్నాడు. తర్వాత హైదరాబాద్‌లో కావేరీ ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్‌గా చేరాడు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే బస్సులకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదానికి.. డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పోలీసులు లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.